లింగంపేట/ ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 12: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నిర్ణీత సమయానికి చేరుకునేలా బస్సు సర్వీసులను నడపాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్ తండా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థులు సమయానికి బస్సులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే లింగంపేట మండలం కేంద్రంలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులతోపాటు ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు.
మంగళవారం ఉదయం లింగంపేట నుంచి ఉదయం 6 గంటలకు బస్సు కామారెడ్డికి వెళ్లిన అనంతరం 9 గంటల వరకు మరోబస్సు బస్సు సౌకర్యం లేకుండా పోయింది. దీంతో కళాశాలకు వెళ్లడానికి వచ్చిన విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. ఎల్లారెడ్డి నుంచి లింగంపేట మీదుగా కామారెడ్డికి వెళ్తున్న బస్సులు నిండుగా రావడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
వారం రోజుల నుంచి బస్సులు ఆపడంలేదంటూ ఆగ్రహించిన విద్యార్థులు మంగళవారం గాంధీనగర్లో రాస్తారోకో నిర్వహించగా.. ఎల్లారెడ్డిమండల పరిధిలోని బాలాజీనగర్ తండా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్సులు సమాయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.