బాన్సువాడ, జూలై 8: బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రెండ్రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అయితే, ఆమె మృతికి వార్డెన్ కారణమని బీఆర్ఎస్తో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తండ్రితో పాటు ఇంటి మీద బెంగతోనే బలవన్మరణానికి పాల్పడిందని అధికారులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. డోంగ్లి మండలం లక్ష్మాపూర్‌కు చెందిన సరిడెవార్ అమృత (17) బాన్సువాడలోని జూనియర్ కాలేజీలో బైపీసీ ఫస్టియర్‌లో అడ్మిషన్ తీసుకుంది.
టీచర్స్ కాలనీలో గల ఎస్సీ బాలికల వసతిగృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తున్నది. అయితే, రెండ్రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. తన తండ్రి మైసయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తనకు కూడా జ్వరం వచ్చిందన్న తండ్రి.. కూతురిని చూసేందుకు బుధవారం హాస్టల్‌కు వచ్చాడు. తన బిడ్డ కాలేజీకి వెళ్లిందా? అని సిబ్బందిని ఆరా తీయగా, వెళ్లలేదని, గదిలో ఉందని బదులిచ్చారు. దీంతో మైసయ్య గది వద్దకు వెళ్లగా తలుపులు మూసి ఉండడంతో కిటికిలోంచి తొంగి చూశాడు. అయితే, కూతురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో గుండెలు బాదుకుంటూ తండ్రి కిటికికి ఉన్న జాలీ తొలగించి, గదిలోకి వెళ్లి కూతుర్ని కిందకు దింపాడు. అయితే, అప్పటికే మృతి చెందింది.
విద్యార్థిని మృతి విషయం తెలిసి బీఆర్ఎస్తో పాటు విద్యార్థి సంఘాలు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగాయి. అమృత మృతికి హాస్టల్ వార్డెన్ కారణమని, విద్యార్థి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేసిందని పేర్కొంటూ పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించుకుండా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ విఠల్‌రెడ్డి అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడారు.
వార్డెన్ తప్పు ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అమృత వాళ్లను వదిలి ఇటీవలే హాస్టల్‌కు వచ్చిందని, తండ్రిపై బెంగ పెట్టుకుందని తెలిపారు. తాను ఇక్కడ ఉండలేనని, నాన్నతోనే ఉంటానని నోట్‌బుక్‌లో రాసుకుందని చెప్పారు. తండ్రిని వదిలి ఉండలేక విద్యార్థిని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందని ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్ తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలు అందించామని, విద్యార్థిని సోదరుడికి ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని, ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
మరోవైపు, విద్యార్థి మృతిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత షేక్ జుబేర్, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జుబేర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంగళవారం తండ్రికి ఫోన్ చేసిన అమృత డబ్బులు డిమాండ్ చేశారని చెప్పిందని తెలిపారు. హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేవని, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యం ఏదో ఒకచోట హాస్టళ్లు, గురుకులాల్లో ఏదో సంఘటన జరుగుతున్నదని, ఇటీవలే బీర్కూర్‌లోని పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు బాడి శ్రీనివాస్, ఖలీల్, ఫిరోజ్ ఖాన్, రమేశ్ యాదవ్, రవీందర్‌గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.