వినాయక్ నగర్, ఆగస్టు 24 : పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ఆదివారం హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. విద్యార్థులు ఒకరిని ఒకరూ గౌరవిస్తూ హింసకు దూరంగా ఉండాలన్నారు. ఎవరినైనా ర్యాంగింగ్ చేస్తే సదరు విద్యార్థులు సంబంధిత అధికారులు లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ రెడ్డి అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు.
నగరంలోని వీక్లీ మార్కెట్ ఏరియాలో నివాసం ఉండే రాహుల్ రెడ్డి నిజామాబాద్ మెడికల్ కాలేజ్‌లో 2021 నుంచి ఎంబీబీఎస్ చేస్తున్నాడని.. డే స్కాలర్‌గా ఉన్నందున ఇతని సీనియర్ అయిన సాయిరాం పవన్ తొలి సంవత్సరం నుంచి బూతులు తిడుతూ ర్యాగింగ్ చేసేవాడని.. దాంతో బాధితుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సాయిరాం పవన్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని ఐదు రోజులు రాసినట్లు రిజిస్టర్లో ఆబ్సెంట్ వేశాడు. ఈ విషయం గురించి రాహుల్ అడిగితే నీవు ఎవడ్రా అడగటానికి బెదిరింపులకు పాల్పడ్డట్లుగా బాధితుడు తెలిపాడు. రాహుల్ రెడ్డి స్నేహితులతో కలిసి హాస్టల్‌కు వెళ్లేసరికి అక్కడ సుమారు 15 మంది సీనియర్స్ ఉన్నారని తెలిపాడు. తనను మళ్లీ ర్యాగింగ్ చేస్తూ గోడ కుర్చీ వేయించి, బయోడేటా పలుసార్లు చెప్పించడం, బట్టలు విప్పించి బయట తిప్పిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు వాపోయాడు.
ఆపేందుకు వచ్చిన స్నేహితులను సైతం కొడతామని బెదిరించినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాహుల్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ అయిన సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్య తనపై దాడి చేశారని, కాలేజీలో ఎలా ఉంటావో ఎలా తిరుగుతావో ఎలా పాస్ అవుతావో చూస్తామంటూ భయభాంత్రులకు గురి చేసినట్లు బాధితుడు వాపోయాడు. హాస్టల్ నుంచి పారిపోయి ఇంటికి వెళ్లి తనకు రక్షణ కల్పించాలని వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 293,115,131తో పాటు ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి కేసు నమోదు దర్యాప్తు చేపట్టారని సీపీ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డినా, సహకరించినా దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో లేదంటే 100 నంబర్‌కు డయల్ చేయాలని.. పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 59700 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.