రెంజల్, మే 31: మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ కాలనీలో చూసినా గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి కుక్కలను చూస్తే చాలు పిల్లలు , వృద్ధులు జంకుతున్నారు. కందకుర్తి గ్రామం లో నీళ్ల కోసం బిందెతీసుకొని బయటికి వెళ్లిన లావణ్య అనే మహిళపై వీధి కుక్కదాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. కొన్ని నెలలుగా గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఉన్నా పంచాయతీ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెంజల్ పీహెచ్సీ పరిధిలోని ఎనిమిది సబ్ సెంటర్ గ్రామాల్లో మే మాసంలో కుక్కల దాడిలో 41 మం ది గాయపడినట్లు అధికారులు నెలవారీ రికార్డులో నమోదు చేశారు. కందకుర్తి గ్రామంలో గురు, శుక్రవారాల్లో 11మందిపై కుక్కలు దాడిచేశాయి. నీలా లో ఐదుగురు, రెంజల్, కళ్యాపూర్, దూపల్లి, ఇతర గ్రామాల్లో కలిపి మొత్తం 41 కేసులు నమోదైనా సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం.