కామారెడ్డి, సెప్టెంబర్ 25: కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. ఆరుగురు మహిళలపై దాడి చేశాయి. శేర్గల్లి, వికాస్‌నగర్, ఆర్బీనగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో సత్తెవ్వ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. రాజమణి, కళావతితో పాటు మరో ముగ్గురిని స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు.
జిల్లా కేంద్రంలో ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే వారి వెంటపడి దాడి చేస్తున్నాయి. వాహనాలపై వెళ్లే వారిని సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. శునకాల భయంతో పిల్లలు, పెద్దలు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు.
సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, సుభాష్‌రోడ్, విద్యానగర్, ఆర్బీ నగర్, లిబ్రా ఫంక్షన్ హాల్ తదితర ప్రాంతాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనబడ్డ వారిపై దాడి చేస్తూ పిక్కలు పీకుతున్నాయి. మార్నింగ్ వాక్కు వెళ్లే వారిని, ఒంటరిగా వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. శునకాల బెడదపై పలుమార్లు మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆయా కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోకముందే మున్సిపల్ అధికారులు కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.