పెద్దకొడప్గల్, అక్టోబర్ 2: కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో విఠల్రావు కూతురు వాణిశ్రీ బుధవారం ఆరుబయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి.
దీంతో చిన్నారి ముఖం, తలపై గాయాలు కావడంతో తల్లిదండ్రులు వెంటనే దవాఖానకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నదని, బయటికి రావాలంటేనే భయపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. గడిచిన రెండు నెలల్లో ఐదుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయని, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.