బాల్కొండ, జూన్ 24: బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, కేజీబీవీని ప్రారంభించారు. కిసాన్‌నగర్‌లో బాల్కొండ నుంచి ముప్కాల్ వరకు రూ.13 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునరుద్ధరణ, నాగపూర్ నుంచి గోదావరి నది వరకు రూ. 1.15 కోట్లతో బీటీ రోడ్డు ఫార్మేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఎవరు అడ్డు వచ్చినా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ. 114 కోట్లతో బాల్కొండ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గణాంకాలతో సహా మంత్రి వివరించారు. తాను అభివృద్ధి కోసం తాపత్రయపడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కమీషన్లు తీసుకుంటున్నానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తన సోదరుడు గంజాయి అమ్ముతున్నాడని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని , గంజాయి అమ్మాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ మాటలు వింటుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోనే అత్యధికంగా గంజాయి కేసులు నమోదయ్యాయని, తాను ఆదిలాబాద్ ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులను పలుమార్లు ఆదేశిస్తే కఠినంగా వ్యవహరించడంతో గంజాయి వాడకం తగ్గిందన్నారు. గంజాయి నిర్మూలన కోసం తాను పని చేస్తే.. తామే అమ్ముతున్నామని నిరాధార ఆరోపణలు చేస్తూ తమ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్‌లు మీకే ఇప్పిస్తా.. దమ్ముంటే ముందుకురండి..
నియోజకవర్గంలో ఉన్న ఏకైక క్రషర్లో రూ.400 కోట్లు సంపాదించారని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను తన బంధువులకు చెప్పి రూ.10 కోట్లకే ఆ క్రషర్ ఇప్పిస్తానని అన్నారు. ఇంకా నియోజకవర్గంలో రూ. 300 నుంచి రూ. 400 కోట్ల పనులు చేపట్టాల్సింది ఉందని, అందులో రూ.100 నుంచి రూ.150 కోట్ల కాంట్రాక్ట్ బీజేపీ నేతలు చెప్పిన వారికే ఇస్తామని, ముందుకు రావాలని సవాల్ విసిరారు. కాంట్రాక్ట్‌లన్నీ వారికే అప్పజెప్తామని, దమ్ముంటే వచ్చి చేయాలన్నారు. అన్ని బట్ట కాల్చి మీద వేసే మాటలే అని, ఏ ఒక్కదానికి ఆధారం లేదన్నారు. తన మీద ఆరోపణలను వారంలో నిరూపించాలని, లేనిపక్షంలో ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు కూడా అభివృద్ధి చేసే వారు ఎవరో, రెచ్చగొట్టే వారెవరో దయచేసి గమనించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ మాయమాటలు నమ్మితే గోస పడుతామన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఉప్పు, పప్పు, నిత్యావసర ధరలు పెంచి సామాన్యులను గోస పెడుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, జడ్పీటీసీ దాసరి లావణ్య, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, సర్పంచులు బూస సునీత, మానేటి నాగభూషణం, పెంటు లింబన్న, ఎంపీటీసీలు కన్న పోశెట్టి లింగవ్వ, మామిడి దివ్య, రాంరాజ్గౌడ్, ఈపీ.నారాయణ, తహసీల్దార్ వినోద్‌కుమార్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, డీఎల్పీవో శ్రీనివాస్, ఉపసర్పంచ్ వాహబ్, కో-ఆప్షన్ మెంబర్ ఫయాజ్ పాల్గొన్నారు.