భీమ్‌గల్, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భా గంగా భీమ్‌గల్ పట్టణంలోని బాపూజీనగర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 15సంవత్సరాల పాటు సుధీర్ఘంగా పోరాడి రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆకలితో అలమటిస్తూ, సాగునీటి కోసం కష్టా లు పడుతూ సీమాంధ్ర పాలకుల చేతిలో మోసపోతూ అష్టకష్టాలు పడిన తెలంగాణను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. రాష్ట్రం సాధించడమే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలబెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యు త్, రైతు బీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ తదితర గొప్ప పథకాలతో తెలంగాణాను సుభిక్షం చేస్తున్నారని.. అందుకే కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. తెలంగాణను ఆనుకొని ఉన్న పొరుగు రాష్ర్టా ల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, జీవితాంతం ఆయన పాలన కొనసాగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. తెలంగాణ రాక మునుపు తలసరి ఆదాయం లక్షా 20వేలు ఉండేదని.. ఇప్పుడు రెండు లక్షల 30వేలకు పెరిగిందన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి లాంగ్‌లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 17 వరకు నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ మండల, పట్టణ కమిటీలకు ధన్యవాదాలు తెలిపారు.