కమ్మర్పల్లి, డిసెంబర్ 24 : సమర్థవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి తన సీడీపీ నిధులు అందించి రూ.50 లక్షలతో నిర్మించిన ప్రజా కల్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో సామాజిక స్పృహ ఉందని..కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి మానవీయ పథకాలు లేవని.. అందుకే దేశమంతా కేసీఆర్ పాలన వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కేసీఆర్ అందిస్తున్నటువంటి మానవీయ సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు. బాల్కొండ నియోజక వర్గంలోని పలు మండలాల్లో ప్రజా కల్యాణ మండపాలు పేదల కార్యక్రమాలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు. కల్యాణ లక్ష్మి ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయానికి ప్రజా కల్యాణ మండపాలు కూడా తోడవుతున్నాయన్నారు.
మండపానికి సామగ్రి అందిస్తా..
కమ్మర్పల్లిలో ప్రజా కల్యాణ మండపానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం వంట సామగ్రి, అవసరమైనన్ని కుర్చీలు, ఫ్యాన్లు అందిస్తానని ప్రకటించారు. ప్రజా కల్యాణ మండపానికి తన తండ్రి స్మారకార్థం వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా కల్యాణ మండపం గ్రామ పంచాయతీ ఆధీనంలో నిర్వహిస్తారని..పేదలకు అందుబాటులో ఉండే స్వల్ప చార్జీలతో సేవలు అందించాలని జీపీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమి, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్, ఆర్డీవో శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు బద్దం చిన్నా రెడ్డి, ఎంపీడీవో సంతోష్ రెడ్డి, తహసీల్దార్ సురేశ్, పీఆర్ ఈఈ ఎస్.మురళి, డీఈ రాజేశ్వర్, ఏఈ దివ్య తదితరులు పాల్గొన్నారు.
తడ్పాకల్లో పీహెచ్సీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఏర్గట్ల, డిసెంబర్ 24 : మండల కేంద్రం నుంచి ఉప్లూర్ వెళ్లే రోడ్డులో ఉన్న పది బొంగుల కల్వర్టు వద్ద రూ. కోటీ 40 లక్షలతో చేపట్టనున్న వంతెన నిర్మాణం, మండలంలోని తడ్పాకల్ గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలకు చెందిన పలువురు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ట్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, సర్పంచులు గుల్లే లావణ్య, పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, భీమనాతి భానుప్రసాద్, కుండ నవీన్, గద్దె రాధాగంగారాం, పద్మాసాగర్ రెడ్డి, మోత్కురి మంజులా బాలాజీగౌడ్, వీడీసీ సభ్యులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.