కామారెడ్డి, ఫిబ్రవరి 11 : ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాల విభజన తర్వాత జీవో 317తో వేరే జిల్లాల నుంచి బదిలీపై వచ్చి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిర్ణయంతో కొంత ఊరట లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో 317 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లకు తాజాగా అవకాశం కల్పించింది. గతంలో వారు పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుంటూ ఈ నెల 12 నుంచి బదిలీ దరఖాస్తులకు జీవో విడుదల చేసింది. 317 జీవోతో కామారెడ్డి జిల్లాలో 550 మందికి, నిజామాబాద్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులకు ఊరట లభించనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉపాధ్యాయాల సంఘాలతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో జీవో 317తో వచ్చిన 550 మంది ఉపాధ్యాయులకు ఊరట లభించింది. ఈ ఉపాధ్యాయుల్లో కేటగిరీల వారీగా ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. జీవో 317 కింద ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు గత సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయంతో జిల్లాలో చాలా మంది జీవో 317తో ఉపాధ్యాయులకు ఊరట లభించింది. అంతే కాకుండా గతంలో పనిచేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకోవడం చాలా అనందంగా ఉంది.అందరికీ న్యాయం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
-అంబీర్ మనోహర్ రావు (పీఆర్టీయూటీఎస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు )
జీవో 317 ప్రకారం బదిలీపై వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. వారు ఇతర జిల్లాల నుంచి వచ్చి మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారికి పాత సీనియార్టీ ప్రకారం అవకాశం ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-గర్దాస్ గోవర్ధన్, ఉపాధ్యాయుడు
నేను జీవో 317తో నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చాను.తాజాగా ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో నిజామాబాద్‌కు బదిలీపై వెళ్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది.ఇంత కాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేదాన్ని ప్రభుత్వ నిర్ణయంతో సంతోషంగా ఉన్నాను.
-సృజన ప్రియ, ఉపాధ్యాయురాలు