మోర్తాడ్/ కమ్మర్పల్లి, ఆగస్టు 6 ;ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సాగుకు పెట్టుబడి సాయం నుంచి పంట చేతికొచ్చే వరకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. గతంలో సాగునీటి కోసమే లక్షలాది రూపాయలు ఖర్చు చేసే పరిస్థితులు ఉండేవి. పక్కనే వరద కాలువ ఉన్నా పంటలకు నీరందని దుస్థితి. కాంగ్రెస్ హయాంలో నేతల అనాలోచిత నిర్ణయాలతో తూములను ఎక్కువ ఎత్తులో నిర్మించడంతో కాలువలు నింపుకోలేని పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో చెరువులు నింపుకోవడానికి అనువుగా తూములను ఏర్పాటు చేశారు. దీంతో పాటు వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వరం జలాలను వరద కాలువలో నింపడంతో రెండు పంటలకు సాగునీటి రంది లేకుండా పోయిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాభావ పరిస్థితులు వస్తే రైతాంగానికి గడ్డుకాలమే… పంటలను బతికించుకోవడం కోసం లక్షల రూపాయల ఖర్చుకు కూడా వెనకాడరు. పక్కనే పెద్దవాగు ఉన్నా, పైన వరదకాలువ ఉన్నా పంటలకు నీరందక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మార్గం చూపించారు. వారి ముందుచూపుతో రైతాంగం ముఖా ల్లో చిరునవ్వులు నిండాయి. వర్షాభావ పరిస్థితుల్లో కాళేశ్వరం జలాలను పైకి తీసుకొచ్చి చెరువులను నింపడంతో ఈప్రాంత అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. వరదకాలువను ఆనుకొని ఉన్న పాలెం గ్రామంలోని మూడు చెరువులను కాళేశ్వరం జలాలతో నింపారు. దీంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డా వరదకాలువతో చెరువులు నింపుకొని పంటలను కాపాడుకోవచ్చన్న భరోసాను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
కాంగ్రెస్ హయాంలో చెరువులకు రాని నీళ్లు..
వరదకాలువ ఉన్నా.. కాలువలో నీళ్లున్నా.. ఏనాడూ పాలెం గ్రామ చెరువులకు నీళ్లచ్చిన దాఖలాలు లేవు. కారణం.. చెరువులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరదకాలువలో ఏర్పాటు చేసిన తూములు ఎత్తుగా ఉండడం. వరదకాలువలో నీళ్లున్నా వాటిని రైతులు వినియోగించుకోలేని దీనస్థితి. తూము ఏర్పాటు చేసినా చెరువులు నింపుకోలేకపోతున్నామని ఆయకట్టు రైతులు నాయకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలి తం లేకపోయిందని రైతులే స్వయంగా అంటున్నారు.
చెరువులు నింపేలా తూము ఏర్పాటు..
వరదకాలువలో చెరువులు నింపేందుకు ఏర్పాటు చేసిన తూములతో ప్రయోజనం లేదని రైతులు మంత్రి ప్రశాంత్‌రెడ్డికి వివరించగా, స్పందించిన మంత్రి వెంటనే చెరువులు నింపేందుకు వరదకాలువలో ఎంత ఎత్తులో తూము ఏర్పాటు చేయాలో అధికారులతో చర్చించి అదే విధంగా తూములను ఏర్పాటు చేయించారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో కాళేశ్వ రం జలాలను వరదకాలువ ద్వారా పైకి తీసుకురావడం, ఎం డిపోతున్న చెరువులను నింపాలని నిర్ణయం తీసుకోవడంతో తూముల ద్వారా చెరువులను నింపారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఏర్పాటు చేయించిన తూముతో వరదకాలువలో తక్కువ ఎత్తులో నీళ్లున్నా చెరువులు నింపుకోవచ్చని అం టున్నారు. తమ ఇబ్బందులను దూరం చేసిన మంత్రికి రుణపడి ఉంటామని రైతులు పేర్కొంటున్నారు.
రూ.10లక్షల ఖర్చుతో ఏర్పాట్లు
వరదకాలువలో తూము ఉన్నా చెరువులు నింపే పరిస్థితి లేకపోవడంతో చెరు వు ఆయకట్టు రైతులు రూ.10లక్షల ఖర్చు తో వరదకాలువ వద్ద ఎనిమిది మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ పెట్టించి, పైప్లైన్ల ద్వారా చెరువులను నింపుకొనే వారు. ఆయకట్టు రైతులు తలా ఇంత జమచేసుకొని ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. చెరువుల్లో నీరు తగ్గినా.. సాగు కోసం నీళ్లు అవసరం ఉన్నా మోటర్లను ఆశ్రయించేవారు. అలాంటి పరిస్థితులకు చెక్‌పెడుతూ తూము నిర్మాణం ఎత్తును మంత్రి వేముల కృషితో తగ్గించడంతోపాటు చెరువులు నింపుకొనేలా చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతలు.. ఉత్తిపోతలే..
పాలెం గ్రామ చెరువులను నింపేందుకు కాంగ్రెస్ హయాంలో పెద్దవాగులో ఎత్తిపోతల పథకాన్ని దాదాపు రూ.1.90కోట్లతో నిర్మించారు. ఇందులో భాగంగా పెద్దవాగులో నాలుగు పెద్దబావులను ఏర్పాటు చేసి అందు లో ఎనిమిది మోటర్లు బిగించి, అక్కడి నుంచి చెరువులకు పైప్‌లైన్ వేయించి చెరువులను నింపాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆరంభంలో కొన్ని రోజులు మాత్రమే పనిచేసి.. ఉత్తిపోతలగా మారింది. మోటర్లు చెడిపోవడం, మరమ్మతులు చేసే వారు లేకపోవడం, మరమ్మతులు చేసినా పదేపదే చెడిపోవడంతో ఎత్తిపోతల ఉన్నా ప్రయోజనం లేకపోయింది. ఈ ఎత్తిపోతల పథకం కోసం ప్రత్యేకంగా మినీ సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదికూడా నిరుపయోగంగానే మారింది. కాంగ్రెస్ హయాంలో రైతుల మోచేతికి బెల్లం పెట్టినట్లు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.
మూడు చెరువులు…ఆరువందల ఎకరాలు…
వరదకాలువ ద్వారా కాళేశ్వరం జలాలతో పాలెం గ్రామానికి చెందిన రాంసాగర్, బూరుగుచెరువు, ఆబికుంటలను నింపారు. ఈ చెరువులను నింపడంతో గ్రామంలో ని ఆరువందల ఎకరాలకు సాగునీరందుతుంది. ము ఖ్యంగా బూరుగు చెరువు కింద 350 ఎకరాలకు సాగునీరందుతున్నది. దీంతోపాటు భూగర్భజలాలు పెరుగుతున్నాయి. భూగర్భజలాలు పెరగడంతో బోరుబావులపై ఆధారపడ్డ రైతులు కూడా పంటలకు సాగునీరందించే అవకాశం ఏర్పడింది. వరదకాలువలో తూము ఏర్పాటు చేయడం, పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మించడంతో పాలెం గ్రామ రైతులకు సాగునీటికి ఢోకాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దశాబ్దాలుగా పడ్డబాధలన్నీ దూరమయ్యాయని అంటున్నారు. తాగునీటి సమస్యలు కూడా తొలగాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు.
ఎత్తిపోతలు ఉన్నా ఫలితం లేకపోయింది..
చెరువులు నింపేందుకు కాం గ్రెస్ గవర్నమెంట్లో పెద్దవాగులో ఎత్తిపోతలను ఏర్పాటుజేసిండ్రు. కానీ, ఎప్పుడు గూడా చెర్లు నింపుకున్నది లేదు. నాసిరకం మోటర్లు పెట్టిండ్రు. ఇప్పుడు వరదకాలువలో తక్కువ ఎత్తులో తూము కట్టించి కాళేశ్వరం జలాలు.. అది కూడా వర్షాలు లేని కాలంల చెర్లు నింపిండ్రంటే సంబురపడ్డం. చెరువులు నింపేందుకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పనిజేసిండని భాజాప్త చెప్పుకుంటం.
– మైలారం కిష్టయ్య, రైతు, పాలెం
రెండు పంటలకు ఢోకాలేదు
వరదకాలువ ద్వారా చెరువులను నింపుకున్నం. ఇప్పట్నుంచి రెండు పంటలకు ఢోకా లేదు. ఇంతకుముందు నీళ్లకోసం నానా తిప్పలు వడ్తుంటిమి. ఇప్పుడటువంటిదేం లేదు. వర్షాలు పడకున్నా కాళేశ్వరం నీళ్లు వస్తయని భరోసా ఏర్పడింది. వరదకాలువలో తక్కువ ఎత్తులో తూము నిర్మించడంతో మాగ్రామానికి ఉన్న ఏండ్ల సమస్య పరిష్కరించినట్లయ్యింది.
– భూమేశ్వర్, రైతు, పాలెం
నీళ్ల కోసం పది లక్షలు ఖర్చుజేసినం..
పెద్దవాగు, వరదకాలువ ఉన్నా చెరువుల నీళ్లు నింపుకొనే పరిస్థితి లేదు. ఎత్తిపోతలు ఉన్నా ఫలి తం లేకపాయే. మంచికింత జమజేసి పదిలక్షలతో ఎనిమిది మోటర్లు పెట్టి, పైప్‌లైన్ వేయించి, ట్రా న్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకొని చెరువులను నింపుకున్నం. కానీ మంత్రి చేసిన పనితోని పైసా ఖర్చులేకుండా ఇప్పుడు చెరువులు నింపుకుంటున్నం. ట్రాన్స్ఫార్మర్, పైపులు, మోటర్లు తీసేసినం. – లక్మ నారాయణ, రైతు, పాలెం