ఖలీల్‌వాడి/కామారెడ్డి రూరల్, జనవరి 6: ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ అతివలదే స్పష్టమైన ఆధిపత్యం కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 14,35,214 మంది ఉండగా, వారిలో 7,58,005 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అటు కామారెడ్డి జిల్లాలోనూ ఆడవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తం 6,90,317 మంది ఓటర్లకు గాను 3,57,215 మంది మహిళలు ఉండడం గమనార్హం. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో నిర్ణయాధికారం అతివల చేతుల్లోనే ఉండడం విశేషం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మొత్తం 21.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 11,15,220 మహిళా ఓటర్లు, 10,10,200 పురుషులు, 111 మంది ఇతరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 1,565 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 14,35,214 మంది, కామారెడ్డి జిల్లాలోని 796 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 6,90,317 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వీరే కాకుండా 1,428 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఇక, అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 3,07, 459 మంది ఓటర్లు ఉం డగా, అత్యల్పంగా బాన్సువాడ సెగ్మెంట్లో 1,98,738 మంది ఉండడం గమనార్హం.