Nizamabad | వినాయక నగర్, జనవరి 24 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఎక్సైజ్ కిందిస్థాయి సిబ్బంది ఆందోళనకు దిగారు. స్మగ్లర్లను పట్టుకునే టాస్క్ వల్ల కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలపైకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎక్సైజ్ ఎస్హెచ్వో స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ వద్ద ఓ కారులో నిర్మల్ జిల్లా నుండి గంజాయి తరలిస్తున్న విషయం తెలియడంతో ఎక్సైజ్ ఎస్హెచ్వో స్వప్న ఆధ్వర్యంలో సిబ్బంది గంజాయిస్ స్మగ్లర్లను పట్టుకునేందుకు ఘటన స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. అయితే కారులో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారును నిల్పకుండా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో గుద్ది పారిపోవడానికి ప్రయత్నించారని అన్నారు.
అయితే చట్ట వ్యతిరేక పనులు చేసే గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లే సమయంలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, పోలీసుల సహాయం లేకుండా, ఆయుధాలు లేకుండా అధికారులు తమను తీసుకువెళ్లి తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎక్సైజ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
కారుతో గుద్దిన ఘటనలో కానిస్టేబుల్ సౌమ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని, ఆమె ప్రాణానికి ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు సిబ్బంది కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకొని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి సిబ్బంది వద్దకు వెళ్లి కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి నచ్చజెప్పడంతో సిబ్బంది ఆందోళన విరమించారు.