కామారెడ్డి, మే 9 : ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలుడులో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30) మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా స్వగ్రామం పాల్వంచలో శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. శ్రీధర్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని సూచించారు. శ్రీధర్ కుటుంబానికి రూ. 2.17 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందజేస్తామని తెలిపారు. అంత్యక్రియల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, గ్రేహౌండ్ కమాండర్ ఆపరేషన్ రాఘవేందర్ రెడ్డి, ఓఎస్డీ దయానంద్, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీ శంకరయ్య,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, పోలీసు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.