టీవీకే పార్టీ అధ్యక్షుడు, అగ్రహీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో అనుకోని సంక్షోభం ఎదురైంది. ఆయన భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇదొక అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గణనీయంగా ఓట్లను సాధించనుందని, కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడాకుల కోసం దళపతి విజయ్ భార్య కోర్టుకెక్కడం సంచలనంగా మారింది.
విజయ్-సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య ఉన్నారు. దాదాపు రెండేళ్ల నుంచి దంపతులిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలిసింది. ఓ హీరోయిన్‌తో విజయ్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, గత కొన్నేళ్లుగా ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఎన్నోమార్లు అభ్యర్థించినా విజయ్ సదరు నటితో సంబంధాన్ని వదులుకోలేదని సంగీత తన పిటిషన్లో పేర్కొన్నది. ఆ నటితో కలిసి విజయ్ అనేక పర్యాయాలు విదేశీ యాత్రలు చేశారని, టూర్ ఫొటోలను ఆ నటి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసేదని, ఇలాంటి చర్యలు తనతో పాటు పిల్లలను క్షోభకు గురిచేశాయని సంగీత పిటిషన్లో వెల్లడించింది. ఏప్రిల్ 20న ఈ కేసు విచారణకు రానుంది.