కాజీపేట, ఫిబ్రవరి 27: దాదాపు నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంత ప్రజ లు కొట్లాడి సాధించుకున్న రైల్వే మల్టీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ( రైల్వే కోచ్ ఫ్యాక్టరీ)లో స్థానికులకే 80శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, అవి సాధించే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు దశల వారీగా ఉద్యమిస్తామని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఓరుగల్లు ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలతోపాటు కేసీఆర్ నాయకత్వం లో జరిగిన పోరాటాల ఫలితమే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతున్నదన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ 1969 తెలంగాణ ఉద్యమం నుంచే ఉందని, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అన్ని విధాలా మేలు జరుగుతుందని నేత లు కోరినట్లు తెలిపారు. ప్రజల పోరాటంతో 1982లో కేంద్ర ప్రభుత్వం వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని, ఇందిరాగాంధీ హత్య, రాజీవ్‌గాంధీ కాలంలో ఈ ఫ్యాక్టరీని పంజాబ్ రాష్ర్టానికి తరలించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట రీ అవసరం లేదని చాలాసార్లు కేంద్ర రైల్వే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిందన్నారు. తెలంగాణ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కా దని, వెనకకు నెట్టేయబడిన ప్రాంతమని కేసీఆర్ ఉద్యమ సమయం లో చాలా సార్లు చెప్పారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో కేసీఆర్ ముందు చూపుతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.
2010-11 రైల్వే బడ్జెట్లో కాజీపేటలో వ్యాగెన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఏపీ పునర్విభజన చట్టం -2014 ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రేనని కేసీఆర్ పలుమార్లు ఒత్తిడి పెంచినట్లు తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీకి అవకాశమే లేదని స్పష్టం చేసి, అదే సమయంలో మహారాష్ట్రకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చే సిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తిరిగి కోచ్ ఫ్యాక్టరీ కాకుండా వ్యాగెన్ పిరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాపుగా మార్పు చేస్తామని, 150 ఎకరాల భూమి కావాలని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం సేకరించి అప్పగించిందన్నారు. ఎట్టకేలకు 2023లో ప్రధాని మోదీ వరంగల్ జిల్లాకు వచ్చి కాజీపేటలో రైల్వే వ్యాగెన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారని అన్నారు.
ప్రస్తుతం ఆది రైల్వే మల్టీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ (రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ)గా చివరి దశకు చేరకున్నదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర సర్కారు మహారాష్ట్రలోని కోచ్ ప్యాక్టరీలో స్థానికులకు ఇచ్చినట్లుగా కాజీపేటలో ఏర్పాటవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేకుంటే దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జీవో తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. అన్ని అర్హతలున్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాల కోసం, కాజీపేట రైల్వే డివిజన్ కోసం బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతుందన్నారు. శనివారం కాజీపేట వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగరావు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ గాయకుడు మిట్టపల్లి సురేందర్, సుంచు కృష్ణ, జోరిక రమేశ్, పులి రజినీకాంత్, పోలపల్లి రామ్మూర్తి, శిరుమల్ల దశరథం, కాటాపురం రాజు, మర్యాల కృష్ణ, ప్రభాకర్, శివకుమార్, కనుకరాజు, రంజిత్, సుంచు అశోక్, వినయ్, మహమూద్, పాము రాజేశ్, కుమ్మరి రాజ్‌కుమార్, గడ్డం నరహరి, దువ్వ కిట్టు, బాజీ, శేఖర్, శ్రీను పాల్గొన్నారు.