నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 22: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం శ్రీరామనామం మార్మోగింది. ఉదయాన్నే వాకిళ్లలో కల్లాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేశారు. గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగించారు. ప్రతి ఇంటికీ కాషాయపు జెండాలను కట్టడంతో అంతటా పండుగ వాతావరణం కనిపించింది. జిల్లాలోని రామాలయాలతోపాటు ఇతర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గ్రామాల్లో ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల కోలాటం, నృత్యాలు, భజనలు ఆకట్టుకున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం, సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు కనులారా వీక్షించారు. ఆలయాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏసీపీలు, సీఐల ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.
మోస్రా మండల కేంద్రంతోపాటు వర్ని మండలంలోని జాకోర, వెంకటేశ్వర క్యాంపులో ఉన్న రామాలయాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏదైనా పని తలపెడితే మోస్రా రామాలయాన్ని దర్శించుకుంటానని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఖిల్లా రామాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ధర్పల్లి, సిరికొండ, మైలారం, రూరల్ మండలంలోని శ్రీనగర్‌లో ఉన్న రామాలయాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు పూజలు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో పూజలు చేసి, కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ సెమినార్ హాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
1992లో చలో అయోధ్య కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ నుంచి కర సేవకులుగా వెళ్లిన అప్పటి రామ భక్తులను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సన్మానించారు. కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, బోధన్ పట్టణం, బోధన్ మండలం, రెంజల్, నవీపేట, ఎడపల్లి, నందిపేట, మాక్లూర్, ఆర్మూర్టప్టణం, మండలంలోని రామాలయాల వద్ద పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరాముని విగ్రహాలతో శోభాయాత్రలు చేపట్టారు.