shakkarnagar | శక్కర్ నగర్ : బోధన్ పట్టణం బీడీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రవీణ్ మహారాజ్, రోహిత్ శర్మలు కార్యక్రమాలను శాస్త్రృక్తంగా నిర్వహించారు. స్వామివారి మూల విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు, నూతన వస్త్రధారణ జరిపించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి జన్మోత్సవాన్ని నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తులతో కళ్యాణోత్సవాన్ని జరిపించారు.
ఈ కార్యక్రమాలకు మల్లారం లింగేశ్వర ఆలయం వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి సమాజంలో ప్రజలు ఉరుకులు పరుగులతో జీవితాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రతి వ్యక్తి తమ కుటుంబాలను విస్మరించి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు లోనై దేశ సంప్రదాయాన్ని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు మన దేశ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
మనిషి సీదా సాదాగా జీవించాలని, ప్రతినిత్యం కొంత సమయాన్ని దైవారాధనకు కేటాయించాలని అన్నారు. ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించాలని, పెద్దలపట్ల మర్యాదలతో ప్రవర్తించాలని ఆయన సూచించారు. దేవాలయాల దర్శనం ద్వారా వ్యక్తుల్లో మార్పు వస్తుందని అన్నారు. ప్రతీరోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతనకు కేటాయించి, మన సంప్రదాయాలను ఆచరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పసులేటి సంధ్య, గోపి కిషన్ దంపతులు కళ్యాణం లో కూర్చున్నారు. ఈ కార్యక్రమాలకు లోకేష్ రుక్మిణి కోనేటి కృష్ణ, జనార్ధన్, భీమ్రావు, కుమార్, రాజేశ్వర్, కిషోర్, అక్షయ్, లింగం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.