నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 26 : జిల్లావ్యాప్తంగా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కృష్ణుడి ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు, డోలారోహణం, కోలాటాలు, గోపాలకాల్వలు, సామూహిక విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణుడు, గోపికల చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
జిల్లాకేంద్రంలో ఇస్కాన్ -ద్వారకానగర్, కంఠేశ్వర్ శాఖల అధ్వర్యంలో విజయలక్ష్మీగార్డెన్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. శివాజీనగర్ గీతామందిరం, ఆర్మూర్రోడ్ మురళీకృష్ణ ఆలయం, ఉత్తరతిరుపతి దివ్య క్షేత్రం, దుబ్బ కృష్ణమందిరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని పూజలు చేశారు. డిచ్పలిల్లో హరేకృష్ణ భక్తుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు క్విజ్, డ్రాయింగ్, భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు. పొతంగల్ మండల కల్లూర్లో రామగణేశ్, పవనసుత గణేశ్ మండళ్ల ఆధ్వర్యంలో, ధర్పల్లిలో వీడీసీ ఆధ్వర్యంలో, చందూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గోపాల క్వాల కార్యక్రమాలు నిర్వహించారు.
జక్రాన్పల్లి మండలంలోని తేజాస్, సిద్ధార్థ, ఆక్స్ఫర్డ్, సరస్వతీ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సిరికొండ మండలంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదాం చేశారు. పెద్దవాల్గోల్లో హారేరామ హరేకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వాయి మండలం గన్నారంలో కృష్ణుడి ఆలయంలో పూజలు చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో పల్లకీసేవనిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ అంగన్వాడీ కేంద్రంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అంగన్వాడీ టీచర్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలో మామిడిపల్లి, గొట్టుముక్కల, బోర్గాం(కె), మాక్లూర్, చిన్నాపూర్ తదితర గ్రామాల్లో శ్రీకృష్ణజన్మాష్టమి యాదవులు, గ్రామస్తులు నిర్వహించారు. శ్రీకృష్ణుని విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. చిన్నారులు చిన్నిక్రుష్ణుడు, గొల్లభామల వేషధారణ ఆకట్టుకుంది. ఉట్టికొట్టిన వ్యక్తికి నగదు బహుమతి అందజేసి గ్రామంలో ఊరేగించారు. ఆలయాల వద్ద అన్నదానం చేశారు. నవీపేటలోని అంగన్వాడీ కేంద్రంలో శ్రీకృష్ణుడు, గొల్ల భామల వేషధారణలో చిన్నారులు అలరించారు. ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఆ సంఘం నాయకులు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
అంగన్వాడీ టీచర్ ఆడెపు లత పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని బోర్గాం తదితర గ్రామాల్లో ఉట్టి కొట్టేందుకు చిన్నారులు పొటీ పడ్డారు. భీమ్గల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అన్నదానం చేశారు. శ్రీసరస్వతి విద్యామందిర్ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. భీమ్గల్లో ఇస్కాన్ సుందర్ రూప్దాస్ ప్రభు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పల్లకీ సేవ నిర్వహించారు. 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గోపాలస్వామి ఆలయంలో గ్రామకమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని యాదవ సంఘ ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించారు. మహా అన్నదానం చేశారు. శ్రీకృష్ణుని చిత్ర పటాన్ని మహిళలు ఊరేగించారు. యాదవ సంఘ పెద్దలు పాల్గొన్నారు.