బిచ్కుంద, జూలై 12: ఓటరు జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గందరగోళంగా మారింది. ‘సర్’ ప్రక్రియ బిచ్కుంద మండలంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. ఇప్పటివరకు కొందరు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందించాల్సిన బూత్ లెవల్ ఆఫీసర్లు చాలా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో తిరగలేదు. దీంతో తమకు ఎన్యూమరేషన్ ఫారా లు అందలేదని స్థానికులు వా పోతున్నారు.
ఆయా గ్రామాల్లో బీఎల్వోలు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లకు ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారు. మండలంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపా లో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జీపీల వద్ద ఓటర్ల పట్ల బీఎల్వోలు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఓటర్లు ఫారాలు నింపడం రాక ఎవరినీ అడగాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు.
ఎన్యూమరేషన్ ఫారంలో 2002ఏడాదికి సంబంధించి ఓటర్ల కార్డు వివరాలను పొందు పర్చాలని ఉన్నది. దీనిపై ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2002లో ఓటు హక్కు ఉన్న వారిలో చాలా మంది వద్ద ఓటరు ఐడీ కార్డులు లేవు. జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో వారు తమ ఓటు ఉంటుందో..పోతుందో నని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సర్ ప్రక్రియ ఇబ్బందుల నడుమ కొనసాగుతున్నది.
బీఎల్వోలకూ సరైన అవగాహన లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫారాలు నింపే విషయంలో స్పష్టతలేక, అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, సర్ ప్రక్రియ గడువు పొడగించాలని కోరుతున్నారు.