ఖమ్మం కమాన్‌బజార్, జూలై 28: ఖమ్మం జిల్లాలోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని, మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలిచ్చారని విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. కానీ, ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు.
ఇన్‌స్ట్రక్టర్ల ఇంటర్వ్యూలకు 30 మారులు, ఆయా పోస్టులకు 50 మారులు, అదనపు అర్హతలకు మరో 20 మార్కులు కేటాయిస్తూ కొత్త మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపించారు. బీఈడీ, డీఈడీ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న మెరిట్ అభ్యర్థులను పకన పెట్టారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆగ్రహించారు. అభ్యర్థులతోపాటు ఎంపిక చేసిన వారి మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ మారుల వంటి వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని, ప్రజా బాహుళ్యానికి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే బాధితులతో వెళ్లి కలెక్టర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని అన్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద మంజూరు చేసే రుణాల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలతోపాటు పీఎంఈజీపీ రుణాల మంజూరుపై కూడా విజిలెన్స్ విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ పథకాన్ని జిల్లాలోని కొందరు దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకు అధికారులు కలిసి పకదారి పట్టించారని ఆరోపించారు.
సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 90 శాతానికి పైగా ఎలాంటి యూనిట్లు (పరిశ్రమలు) స్థాపించకుండానే సుమారు రూ.10 కోట్లకు పైగా రుణ సబ్సిడీలను బినామీల పేరిట బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, బిచ్చాల తిరుమలరావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.