ఖమ్మం కమాన్బజార్, జూలై 28: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని, కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ మోటార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్, వరర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా గౌరవాధ్యక్షుడు పగడాల మల్లేశ్ మాట్లాడారు.
ఆర్టీసీ తర్వాత లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద రవాణా వ్యవస్థ ఆటో రంగమేనని గుర్తు చేశారు. ఆటోలు నడుపుతూ స్వయం ఉపాధి పొందుతున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో వరర్స్ యూనియన్ నేతలు, డ్రైవర్లు పాల్గొన్నారు.