కోటగిరి/రుద్రూర్, నవంబర్ 9: ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సాధించి నేడు దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భారీగా నిధులు మంజూరు చేస్తూ పల్లెల నుంచి పట్టణాల దాకా అభివృద్ధి చేయడంతోపాటు ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. కోటగిరి, రుద్రూర్ మండలాల్లో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. మరో పది ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షల నిధులతో నిజాంసాగర్ కెనాల్‌పై నిర్మించిన వంతెన, రూ. 23 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకు, రూ.9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. రుద్రూర్ మండలకేంద్రంలో రూ.10 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ. 35 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.15 లక్షల నిధులతో నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ప్రారంభించారు. డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో స్పీకర్ ప్రసంగిస్తూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, 5 వేల ఇండ్లల్లో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారని తెలిపారు. త్వరల్లోనే రూ 3లక్షలతో సింగిల్ బెడ్రూం స్కీం కూడా రానుందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా ఆసరా పింఛన్లను అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని అన్నారు. ఆసరా పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు ఏడాదికి రూ.1500 కోట్లను అందజేస్తున్నదని తెలిపారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే తెలిసీతెలియని ప్రతిపక్ష నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడడం సబబు కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. రుద్రూర్లో వైద్య సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేస్తూ ప్రభుత్వ దవాఖానల్లోనే నార్మల్ డెలివరీ అయ్యేలా సిబ్బంది కృషి చేయాలన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు వల్లెపల్లి సునీతా శ్రీనివాసరావు, అక్కపల్లి సుజాతా నాగేందర్, జడ్పీటీసీలు శంకర్‌పటేల్, నారోజీ గంగారాం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్‌కుమార్, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
దుర్కి దర్గా వద్ద ప్రార్థనలు
నస్రుల్లాబాద్, నవంబర్ 9 : మండలంలోని దుర్కి శివారులో ఉన్న సయ్యద్ అల్లావుద్దీన్ బాషా దర్గాను స్పీకర్ దర్శించుకొని ప్రత్యేక ప్రార్థలు చేశారు. అనంతరం బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో పెంచుతున్న శ్రీ గంధం మొక్కలను పరిశీలించారు.