బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 15 : ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో రూ. 25లక్షలతో నిర్మించిన ముదిరాజ్ సంఘం భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రూ. 20 లక్షలతో చేపట్టనున్న హనుమాన్ ఆలయ సన్నిధానం పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుం దని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో అధ్యాత్మికతను పెంపొందించేలా కేసీఆర్ సహకారంతో కులమతాలకు అతీతంగా ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణానికి రూ.150 కోట్లు, 112 కల్యాణ మండపాల కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దూర దృష్టితో రూ.85వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి రెండు పంటలకూ సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదన్నారు. పేదలకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందాలనే సంకల్పంతో నియోజకవర్గంలో దవాఖానలు, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశానని తెలిపారు. బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రికార్డుస్థాయిలో ఒకే నెలలో 504 ప్రసవాలు జరిగాయని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, దళిత బంధు తదితర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజమణి, ఆర్డీవో భుజంగ్‌రావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు దొడ్ల నీరజారెడ్డి, పద్మారెడ్డి, బుడ్మి, బాన్సువాడ విండో చైర్మన్లు గంగుల గంగారాం, ఏర్వాల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాత బాలకృష్ణ, దొడ్ల వెంకట్రాంరెడ్డి, పిట్ల శ్రీధర్, మహ్మద్ ఎజాస్, జగన్, లింగం, కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.