బాన్సువాడ, నవంబర్ 4: బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. బాన్సువాడలోని జ్ఞానసరస్వతీ, అయ్యప్ప ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం తన సతీమణి పుష్పమ్మ ఎదురురాగా, పోచారం తన సెంటిమెంట్ కారులో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు, రైతులు , అన్నివర్గాల వారు సుభిక్షంగా ఉన్నారని, మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ , బీజేపీలకు అభ్యర్థులు దొరకడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారని అన్నారు. వేరే ప్రాంతాల వారికి నియోజకవర్గం గురించి ఏం తెలుస్తుందని, వారు తెలుసుకోవాలంటే పదేండ్లు పడుతుందని అన్నారు. అలాంటి వ్యక్తులు వచ్చి సాధించేది ఏమీ లేదని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆమోదయోగ్యం కాని, అమలుపరచలేని హామీలను ఇచ్చి చేతులెత్తేస్తున్నదని చెప్పారు. ఐదు గంటల కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన పనులతోపాటు హామీ ఇవ్వకుండా చేసిన పథకాలు , పనులు పదుల సంఖ్యలో ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలవి మాటలే తప్పా, చేతలు కావని విమర్శించారు. బాన్సువాడలో ఎవరు ఏం చేశారు.. ఏ పార్టీ నాయకుడు మంచి చేస్తాడని ప్రజలకు తెలుసని, వారే ఆలోచించాలని సూచించారు. ప్రజలు మంచిమనస్సుతో ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశానని, పార్టీ ఇచ్చిన ఏ ఫారం, బీఫారం, అఫిడవిట్‌ను సమర్పించినట్లు తెలిపారు.
హుందాగా, ప్రజలు మెచ్చేలా ఉండాలి..
ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రచారం హుందాతనంతో, ప్రజలు మెచ్చేలా ఉండాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి వారి శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పారు. తాను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశానని, 1994 నుంచి నేటివరకు ఎనిమిదిసార్లు పోటీ చేసి ఒక్కసారి ఓటమి చెందానని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారి మధ్యలోనే ఉంటున్నానని, ఈసారి ఎన్నికల్లో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్నానని చెప్పారు. వచ్చే ఐదేండ్లు కూడా ప్రజా ఆశీర్వాదం, యువకుల సహకారంతో గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, నాయకులు డాక్టర్ అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎజాస్, గంగాధర్ పటేల్, వీర్రాజు, భరత్‌నాయక్ తదితరులు ఉన్నారు
ప్రచారం షూరూ..
బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం ప్రారంభించారు.
అనంతరం బీర్కూ ర్ తండా, కిష్టాపూర్, చించోలిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలు, భాజాభజంత్రీల చప్పుళ్ల మధ్య పటాకులు కాల్చారు. గ్రామాల్లో పోచారం రాకతో ప్రజలు మంగళహారతులు పట్టారు.