మహిళలను గౌరవించే దేశంలో ఓ ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి పదవిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆ పదవికే కళంకం తెచ్చినట్లు అవుతుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా ఒక్కటై బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయంటే ఆయన మాటలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. మరోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను స్పీకర్ హోదాలో కాకుండా ఒక సగటు దేశ పౌరుడిగా స్పందిస్తున్నట్లుగా ప్రకటించారు.
-కామారెడ్డి, మార్చి 12
కామారెడ్డి, మార్చి 12 : మనది మాతృమూర్తులను గౌరవించుకునే సంస్కృతి అని, ఓ ఆడబిడ్డపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దుశ్చర్యలతో ఇతర దేశాల ముందు భారత్ తలవంచాల్సి వస్తున్నదని అన్నారు. దేశం విలువలు పతనమయ్యాయని, రాముడు ఏలిన ఆ రాజ్యం ఇప్పుడు లేదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు, నిరుద్యోగ సమస్య పెరిగిందని, జీడీపీ పడిపోతున్నదని అన్నారు.రైతులు గోస పడుతున్నారని, యువత ఉపాధి లేక రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. తాను స్పీకర్ హోదాలో కాకుండా దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు.
మోదీ అంటే ఈడీ..
ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న దేశంలో అదానికి మాత్రమే మోదీ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశ ప్రజలు ఏది కొనాలన్నా, అమ్మాలన్నా అదానీనే దిక్కనే రీతిలో ప్రధాని వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలు, అవసరాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మోదీ అంటే ఈడీ.. ఈడీ అంటే మోదీగా మారిందన్నారు. ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు. ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్‌ను కబందహస్తాల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమన్నారు.
నోరు అదుపులో పెట్టుకోవాలి..
జాగృతి సంస్థను స్థాపించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవితను తొమ్మిది గంటలపాటు విచారించడం సిగ్గుచేటని అన్నారు. ఓ ఆడబిడ్డపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. సంజయ్ ఓ వీధిరౌడీలా ప్రవర్తించారని, ఒక తల్లికి పుట్టినవారు ఇలాంటి మాటలు మాట్లాడబోరని అన్నారు. మనది మహిళలను గౌరవించే సంస్కృతి అని, అలాంటిది నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. మాతృమూర్తిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. తమ బలగం శాంతియుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ చీమూ నెత్తురు ఉంటుందని, ఆడబిడ్డలను అవమానిస్తే బీఆర్ఎస్ సైన్యం చూస్తూ ఊరుకోబోదని, బీజేపీ కార్నర్ మీటింగులే జరుగవని హెచ్చరించారు. గతంలోనూ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని నలుగురు పార్లమెంట్ సభ్యుల్లో ఒక్కరైనా తెలంగాణ రైతుల క్షేమం కోసం మాట్లాడలేదని అన్నారు. రైతులు, మహిళలను అవమానించడం, అధికారులను అవహేళన చేయడం తగదన్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మరిందని అన్నారు. దీనిని చూసి ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. పక్క రాష్ర్టాల ప్రజలు కేసీఆర్‌ను ఆహ్వానించడం బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. తొమ్మిదేండ్లలో వారు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలుగా తమ ప్రభుత్వం చేసిన వంద అభివృద్ధి పనులను చూపిస్తామన్నారు. కేంద్రం తీరును ప్రజల వద్దకు తీసుకెళ్లేవారిపై ఈడీతో కేసులు పెట్టిస్తున్నారని, ముందుగా అదాని ఆస్తులపై దాడులు చేయాలన్నారు.
ఇక ఆటలు సాగవు..
అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని, ఎలక్షన్లు వచ్చాయంటే ఏదో ఒక నినాదంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాటకాలు ఇక ఎక్కువ రోజులు సాగవని అన్నారు. కవితను విచారిస్తుంటే బండి మరోవైపు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవి యాదవ్, మామిండ్ల అంజయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.