కోటగిరి, మే 2: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అకాలవర్షాలు, వడగండ్లతో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నారని తెలిపారు. మంగళవారం ఆయన ఉమ్మడి కోటగిరి మండలంలోని గన్నారం, కల్లూర్, జల్లాపల్లి అబాది, జల్లాపల్లిఫారం, పొతంగల్, కోటగిరి ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు. వర్షాలకు ధాన్యానికి మొలకలు వచ్చాయని రైతులు చూపడంతో.. ఏ మాత్రం ఆందోళన చెందవద్దని, కచ్చితంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పీకర్ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం కోటగిరి మార్కెట్ కమిటీ కార్యాలయంలో సభాపతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ 10 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు సైతం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం ఎప్పటికప్పుడు నిల్వ చేసుకోవాలని, దీంతో రవాణా ఇబ్బందులు ఏర్పడవని తెలిపారు.
అకాల వర్షాలు, వడగండ్ల వాన ఇలా ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రైతులు కూడా ముందస్తుగా పంటలను సాగు చేసుకోవాలని సభాపతి పోచారం కోరారు. గతంలో సాగు నీటి సమస్య ఉండేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీటి సమస్య పూర్తిగా పోయిందన్నారు.ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. రైతులు ఇక నుంచి జూన్‌లోపు నారుమళ్లు సిద్ధం చేసుకొని జూలై మొదటి వారంలో నాట్లు పూర్తి చేసి అక్టోబర్ 15లోపు వరి కోతలు పూర్తి చేయాలన్నారు.నవంబర్ మొదటి వారంలో నారుమళ్లు సిద్ధం చేసుకొని డిసెంబర్లో నాట్లు పూర్తి చేస్తే మార్చి 15 వరకు కోతలు పూర్తి చేసుకుంటే అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోవచ్చని వివరించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని ఏ రైస్‌మిల్లుకు తరలించాలని.. రైతులను ఎలా ఆదుకోవాలనే అంశంపై రైస్‌మిల్లర్లతో అధికారులు చర్చిస్తారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, డీఎస్వో చంద్రప్రకాశ్, పొతంగల్ తహసీల్దార్ విజయలక్ష్మి, జడ్పీటీసీ శంకర్‌పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిశోర్‌బాబు, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, విండో చైర్మన్లు అశోక్‌పటేల్, కూచి సిద్దూ, సర్పంచులు పత్తి లక్ష్మణ్, సాయిబాబా, వర్ని శంకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.