బాన్సువాడ, మే 2: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నదాతకు అండగా నిలిచారు. అకాల వర్షాలతో కల్లాలతోపాటు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో చలించిపోయారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. కంటిమీద కునుకులేకుండా సోమవారం అర్ధరాత్రి వరకు, మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంటాలు ఏర్పాటు చేయించి, ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతుల కన్నీళ్లు తుడిచారు. ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్ , దామరంచ, మిర్జాపూర్, వీరాపూర్, చించోల్లి, కిష్టాపూర్, బీర్కూర్, కోటగిరి, చందూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించా రు. తాను తిరిగి వచ్చేలోపు ఒక్క ధాన్యం బస్తా కూ డా తనకు కనిపించవద్దంటూ ఆదేశాలు జారీ చేశా రు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీలను రైస్‌మిల్లర్లు ఇబ్బందులు పెట్టవద్దని సూ చిం చారు. ఒకటి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాత్రి 9.30 గంటలకు : బాన్సువాడ నర్సింగ్‌రావు కాంటా వద్ద ఆరబోసిన ధాన్యాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో భాస్కర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కాంటాలు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌ను ఆదేశించారు.
రాత్రి 10.15 గంటలకు : మండలంలోని కొల్లూ ర్ గ్రామానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. వెంటనే సొసైటీ సిబ్బందిని పిలిపించి కాంటాలు ప్రారంభించాలని, తాను మళ్లీ వస్తానని చెప్పారు.
రాత్రి 10.40 గంటలకు: బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామానికి వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి నస్రుల్లాబాద్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో ధాన్యం కాంటాలు ఏర్పాటుచేయించడంతో రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నారు.
రాత్రి 12 గంటలకు: నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఆయాశాఖల అధికారుల నేతృత్వంలో కొనసాగుతున్న కాంటాలను పరిశీలించారు. ధాన్యాన్ని రైస్ మిల్లుల కు చేరే వరకు అక్కడే ఉండి రైతులతో ముచ్చటించారు.
అర్ధరాత్రి 2 గంటలకు: బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌కు చేరుకున్నారు.కాంటాలు ఎందుకు పెట్టడం లేదని రైతులతో మాట్లాడారు. ఉదయం ప్రారంభిస్తారని చెప్పడంతో వెనుదిరిగారు.
ఉదయం 9 గంటలకు: మళ్లీ కొల్లూర్‌కు సభాపతి చేరుకొన్నారు.కొనుగోలు కేంద్రాలు, రోడ్డు పై కొనసాగుతున్న కాంటాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతి బస్తాను లారీలోకి ఎక్కించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని సొసైటీ సిబ్బంది, అధికారులను హెచ్చరించారు.
ఉదయం 11.30 గంటలకు: బీర్కూర్, మే 2: బీర్కూర్ మార్కెట్ యార్డును సభాపతి సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమవంతు ప్రయత్నం చేస్తామని, అధికారులు సైతం అలసత్వం లేకుండా పనిచేయాలని ఆదేశించారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు : కోటగిరి మండలంలో ఆరబెట్టిన వరి ధాన్యాన్ని పరిశీలించారు.
నాలుగు గంటకు : కోటగిరి ఏఎంసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.