బాన్సువాడ, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తి తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందు లో భాగంగానే పేదరికంలో ఉన్న దళితులు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు సమాజంలో వారికి అందరితో సమానంగా గౌరవం దక్కేందుకు సీఎం కేసీఆర్.. దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడ పట్టణంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ 116వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శాసన సభాపతి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
దళితసంఘాల నాయకులతో సహపంక్తి భోజనం చేశారు. ముందుగా తహసీల్ కార్యాలయ సమీపంలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసి.. పూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని మీనా గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో జగ్జీవన్‌రామ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారని ఆయన ఔన్నత్యాన్ని వివరించారు.
ఓ కుగ్రామంలో పుట్టిన ఈయన 50 ఏండ్ల సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులను అలంకరించి వన్నె తెచ్చారని కొనియాడారు. ఇలాంటి నాయకుల ఆశయాలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున అందజేస్తున్నదని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వడంలేదన్నారు. ఏ పథకమైనా అందరికీ ఒకేసారి అమలుచేయడం కుదురదని, అంచెలంచెలుగా అందరికీ అందుతాయని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో డబుల్ ఇండ్లను నిర్మించగా, అందులో దళితులకే అధిక సంఖ్యలో కేటాయించామన్నారు.
సంక్షేమానికే ఏటా వేల కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నదని తెలిపారు. 46లక్షల మందికి ఏడాదికి రూ. 15వేల కోట్లతో పింఛన్లు, 76 లక్షల మంది రైతులకు రూ. 15వేల కోట్ల రైతుబంధు సాయం, రూ. 1600 కోట్ల రైతుబీమా, వ్యవసాయానికి రూ. 12వేల కోట్లతో ఉచిత కరెంటు అందిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ‘డబుల్’ ఇండ్ల కోసం రూ. 10వేల కోట్లు, కల్యాణలక్ష్మి కింద రూ.10వేల కోట్లు, కేసీఆర్ కిట్ పథకానికి రూ. 12వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
కార్యక్రమంలో రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎజాజ్, చందూ ర్ సర్పంచ్ సాయిరెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు పోచీరాం, జగ్జీవన్‌రామ్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు గంగారాం, ఏఎంసీ చైర్మన్ సంజీవ్, ప్రసాద్, ప్రశాంత్ కుమార్, పాండురంగం, అంబేద్కర్ సంఘం నాయకులు మైశయ్య, పోశీరాం, హన్మాండ్లు, రాజు, వినోద్, సాయిలు పాల్గొన్నారు.