బాన్సువాడ, సెప్టెంబర్ 27: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4లక్షల 50వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని, మరో 4లక్షల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. బాన్సువాడ పట్టణం బీర్కూర్ చౌరస్తాలోని ఎస్ఎంబీ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన పీబీఆర్ మెగా జాబ్‌మేళాలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతీయువకులకు ఆర్డర్ కాపీలను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ 2014కు ముందు ఐటీ రంగంలో మూడు లక్షల ఉద్యోగాలు ఉంటే ప్రస్తుతం 9లక్షలకు పెరిగాయని అన్నారు.
ఐటీ రంగంలో కొత్తగా ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 22వేల పరిశ్రమలకు అనుమతులు వచ్చాయని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో 18లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ యువతకు ఉద్యోగాలను ఇప్పించాలనే మంచి ఉద్దేశంతో తన కుమారుడు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డికి నా తరఫున, యువత తరఫున అభినందనలు తెలిపారు. ఈ మెగా జాబ్‌మేళాలో వివిధ రంగాలకు చెందిన 70 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొనాయని, నాలుగు వేల మంది ఉద్యోగ ఆశావహులు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వెళ్లకుండా, ఒకే వేదికపై అనేక కంపెనీలను తీసుకురావడం సంతోషకరమన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు అభ్యర్థుల అర్హతల మేరకు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు.
భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయ్యి మంది యువతీయువకులకు బాన్సువాడ, రుద్రూర్ మండల కేంద్రాల్లో రూ.కోటిన్నర ఖర్చుతో పీబీఆర్ కోచింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించారని గుర్తుచేశారు. శిక్షణ పొందిన వారిలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి, రైతు బంధుసమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, బీర్కూర్ ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూపాశ్రీనివాస్, నస్రుల్లాబాద్ ఎంపీపీ విఠల్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు, నారోజి గంగారం, పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ, సెప్టెంబర్ 27: పీబీఆర్ మెగా జాబ్‌మేళా ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చిన వారు త్వరగా విధుల్లో చేరాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి సూచించారు. పీబీఆర్ మెగా జాబ్‌మేళాలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని చదువుకున్న యువతీయువకులందరూ ఉద్యోగాలు పొందాలని సభాపతి సూచించారన్నారు. ఇలాంటి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌లోని కంపెనీలకు వెళ్లి ఇంటర్వ్యూలకు హాజరైతే స్పందన వేరేలా ఉంటుందని, ఇక్కడైతే అర్హత ఉన్నవారికి వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారని చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో వేలాదిగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని, దీంతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభింస్తున్నాయని అన్నారు.