కామారెడ్డి, సెప్టెంబర్ 25: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం జరిగిన విధ్వంసంతో పాటు పోలీసులపై దాడి చేసిన వారిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. కామారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్లో ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. జీవదాన్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలికతో పీఈటీ అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మేరకు ఈ నెల 23న పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. ఈ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారని, నిందితుడిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. పాఠశాలలో జరిగిన ఆందోళనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని, ఏఆర్ కానిస్టేబుల్ కాలు విరిగిందని తెలిపారు. అల్లర్లు సృష్టించిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే కొందరి పేర్లతో జాబితా రూపొందించామని, వారిలో దాడులకు పాల్పడిన వారిని గుర్తిస్తామన్నారు. చిన్నారి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. జీవదాన్ పాఠశాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు పాల్గొన్నారు.