కామారెడ్డి,డిసెంబర్ 30: కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి నేరాల సంఖ్య పెరిగింది. మహిళా సంబంధిత నేరాల్లోనూ పెరుగుదల నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఏడాది వ్యవధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డితో కలిసి వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. 2023లో జిల్లావ్యాప్తంగా మొత్తం 5,578 కేసులు నమోదు కాగా, ఈసారి 6,006 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఇందులో 708 ఆస్తి సంబంధిత నేరాలు, 38 హత్యలు, 35 కిడ్నాప్‌లు, 60 అత్యాచారాలు, 513 రోడ్డు ప్రమాద కేసులు, 1,441 ఇతర కేసులు, 561 స్పెషల్ లోకల్ చట్టాలు కేసులుగా, 535 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని వివరించారు.
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. ముగ్గురి మృతి కేసుపై విలేకరులు ప్రశ్నించగా ఆమె స్పందించారు. అవి హత్యలా.. ఆత్మహత్యలా? ప్రమాదకరంగా జరిగిందా? కాపాడే క్రమంలో జరిగిందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ముగ్గురి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.