ఆర్మూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ముస్కు పద్మా వెంకట్రామ్రెడ్డి(45) చికిత్సపొందుతూ దవాఖానలో శుక్రవారం మృతి చెందారు.ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామం నుంచి ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ మహిళ డిగ్రీ కళాశాల విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో మంథని, పిప్రి గ్రామాల మధ్య వాగు విపరీతంగా ప్రవహించడంతో ఈ రెండు గ్రామాల మధ్య నుంచి ఆర్మూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గత బుధవారం మంథని గ్రామం నుంచి మిర్ధాపల్లి మీదుగా తండ్రితో కలిసి స్కూటిపై బయలు దేరారు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో ఆమె తలకు తీవ్రగాయలయ్యాయి. తండ్రికి స్వల్పగాయాలు అయ్యాయి.
ఆమెను ఆర్మూర్, నిజామాబాద్ దవాఖానలో చికిత్సకోసం వైద్యులు నిరాకరించడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించి ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం పద్మా వెంకట్రామ్రెడ్డి మృతి చెందారు. ఆమె భర్త గతంలో మంథని గ్రామ ఎంపీటీసీగా పని చేశారు. ముస్కు పద్మకు భర్త వెంకట్రామ్రెడ్డి, కుమార్తె ,కుమారుడు ఉన్నారు. ఆమె మరణం పట్ల ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్‌తో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, పలువురు విద్యావేత్తలు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.