ఖలీల్వాడి / కామారెడ్డి, జూలై 29 : వానకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. పాముకాటు ప్రమాదాలూ అధికంగా ఉంటాయి. రైతులు పగలు,రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వానకాలం కావడంతో గుబుగుబురు పొదలు, పొలాలు, ఏపుగా పెరిగిన చెట్ల పొదల్లో పాములు, విషపురుగులు మాటువేసి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణహాని కలుగుతుంది. పొలాల వద్ద నివాసం ఉండే వారు, చెట్ల పొదల వద్ద ఇండ్లు ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించినా పాముకాటుకు గురయ్యే అవకాశం ఉంది. రాత్రివేళల్లో నివాస ప్రాంతాల్లో పాములు సంచరిస్తూ ఇండ్లలోకి ప్రవేశిస్తాయి. ప్రతి యేటా పాముకాటుకు గురై చాలా మంది మరణిస్తున్నారు. పాము కాటుకు గురైన వెంటనే దవాఖానకు వెళ్తే 99శాతం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, సాధారణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
వ్యక్తిని విషపూరితమైన పాము కరిచినప్పుడు శరీరమంతా నీలం రంగుగా మారుతుంది.
రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు.
పాము కాటువేసిన చోట నొప్పి, వాపు ఉంటుంది. మరికొందరిలో పొక్కులు,దద్దుర్లు కనిపిస్తాయి.
నోటి నుంచి నురగ వస్తుంది.
ఆయాసపడి చెమటలు పట్టి ఉంటే సాధారణ స్థాయి కన్నా రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుం టుంది.
ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే దవాఖానకు తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు..
భిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన నారిగల్ల శంకర్ (59) అనే రైతు పొలం పనులు చేస్తుండగా గుర్తు తెలియని పాము కాటు వేసింది. ఆ విషయం తెలియక ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాడు. కాసేపటికి నోటిలో నుంచి నురుగ రావడంతో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
రాజంపేట మండలం షేర్ శంకర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూడుమామిళ్ల తండాలో రవి(40), అతని కొడుకు వినోద్ (12) ఇంట్లో పడుకున్నారు. వినోద్ పైనుంచి పాము వెళ్లడాన్ని గమనించిన రవి కర్రతో కొట్టి చంపేశారు. అప్పటికే తండ్రీకొడుకులను పాము కాటేసింది. వినోద్ ఇంట్లోనే మృతి చెందగా, రవిని దవాఖానకు తీసుకెళ్లేలోపు మరణించాడు.
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పీహెచ్సీలు, 8 సీహెచ్సీలు, ఆర్మూర్, బోధన్ ఏరియా దవాఖానలతోపాటు నిజామాబాద్ జీజీహెచ్లో పాముకాటుకు మందులు సిద్ధంగా ఉన్నాయి. కాటు వేసిన వెంటనే పామును గుర్తించడంతోపాటు దవాఖానకు వెళ్తే బతికే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్వో, నిజామాబాద్
వానకాలంలో పాము కాట్లు విపరీతంగా ఉంటాయి. పాముకాటుకు గురైన బాధితుడికి ముందుగా ధైర్యం చెప్పి వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేయాలి. బాధితుడికి ధైర్యం చెప్పకపోతే భయపడి ఆందోళనతో చికిత్స చేయకుండానే ప్రాణం కోల్పోతాడు. రైతులు,ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
– డా.విజయలక్ష్మి, కామారెడ్డి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్
నవీపేట, జూలై 29: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని బినోలా గ్రామానికి చెందిన రెండేండ్ల బాలుడిని రెండు పాములు కాటు వేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బినోలా గ్రామానికి చెందిన భూమేశ్, హర్షిత దంపతులకు రుద్రాన్ష్ రెండేండ్ల కొడుకు ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించగా..అకస్మాత్తుగా రెండు పాములు ఇంటిపై కప్పు నుంచి కిందపడ్డాయి. నిద్రలో ఉన్న రుద్రాన్ష్ను కాటువేయడంతో బాలుడు భయపడి ఏడుస్తూ లేచాడు. గమనించిన తల్లి వెంటనే పాములను పట్టుకొని బయటికి విసిరివేయగా స్థానికులు వచ్చి వాటిని చంపివేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని జిల్లా వైద్యశాలకు తరలించగా..చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెంకుటిండ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో పాములు ఇంట్లోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.