కామారెడ్డి, సెప్టెంబర్ 18 : ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అందులో ఉన్న చిన్నారులు సురక్షింతంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్‌కు చెందిన బస్సు రామారెడ్డి చౌరస్తా వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించాయి.
వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కన నిలిపివేశాడు. గమనించిన స్థానికులు వెంటనే చిన్నారులను బస్సులో నుంచి సురక్షితంగా కిందికి దింపారు. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని ఫోన్ ద్వారా మాట్లాడడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు.
సాంకేతిక లోపమని, బ్యాటరీలో నీళ్లు లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు బస్సుడ్రైవర్ తెలిపాడు. ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో సెల్ఫ్మోటర్ వద్ద ఉన్న వైర్ కాలి పోవడంతో పొగలు వచ్చాయని, బ్యాటరీ పేలలేదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టామని, త్వరలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.