MLA Vemula Prashanth Reddy | నిజామాబాద్ : కేసీఆర్‌ను సిట్, కమిషన్లు ఏమీ చేయలేవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ శిఖరం, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన, కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణకు ప్రతిరూపమైన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికే నోటీసులు ఇచ్చినట్టేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందు సిట్లు, కమిషన్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నోటీసుల డ్రామా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు కానీ.. పూటకో డైవర్షన్ డ్రామాలు చేస్తూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేకపూరిత, పిల్ల చేష్టలతో కూడిన పాలనలో ప్రభుత్వ సంస్థలు స్వతంత్రత కోల్పోయి కేవలం కీలుబొమ్మలుగా మారాయాన్నారు.
తెలంగాణ చరిత్రను లిఖించిన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలతో మలినం అంటించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలు చివరికి ఆయనే ప్రజల్లో నవ్వులపాలవుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని, సిట్లు, కమిషన్ల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలైన స్వభావాన్ని బయటపెడుతోందన్నారు.
కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి తానే తన రాజకీయ సమాధిని తానే రాసుకున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిట్లు, కమిషన్లు, అక్రమ కేసులతో కేసీఆర్‌ను ఏమీ చేయలేరని, తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.