భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ నవ శకానికి నాంది పలుకనున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని, ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో పార్టీ నూతన జెండా, కండువాను దేవుని చెంత ఉంచి పూజలు చేసిన సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడినైన తనకు పూజలో గుమ్మడికాయతో కూష్మండ బలి ఇచ్చే గొప్ప అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. కేసీఆర్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి సంకల్పం గొప్పదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని ముద్దాడి తీరుతాడని పేర్కొన్నారు. ఎర్రకోట మీద గులాబీ జెండా రెపరెపలాడుతుందన్నారు.
-వేల్పూర్, డిసెంబర్ 9