వినాయక నగర్ ( నిజామాబాద్) : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నా, వారు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు(Sexual harassment ) పెరగడం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల (Sunitha Kunchala) అన్నారు. వేధింపులు, దాడులు మహిళల్లో అభద్రతను పెంచి పోటీ ప్రపంచంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ (Nizamabad) నగరంలోని పోలిస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మహిళలపై అత్యాచారానికి పాల్పడినా, శారీరక సంబంధం పెట్టుకొమ్మని బలవంతం చేసినా, అశ్లీల పదజాలం వాడినా, అశ్లీలంగా ఎటువంటి సైగలు చేసినా, అశ్లీల చిత్రాలు తీసినా, చూపించినా లైంగిక వేధింపుల చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వరంగ సంస్థ, ప్రైవేటు సంస్థ, కర్మాగారాలు, విద్యాసంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, ఎన్జివో, సేవలందించే సంస్థలు, ఆసుపత్రుల్లో మహిళపై లైంగికంగా వేధిస్తే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్ లో , షీ టీమ్, భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు పని చేసే చోట కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బాధితురాళ్లు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.
కార్యక్రమంలో నిజామాబాదు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ పి. పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుష్బూ, ఉపాధ్యాయ, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, కంప్లైంట్ అథారిటీ చైర్ పర్సన్ నీరజ రెడ్డి, అదనపు డీ.సీ.పీ (ఏ ఆర్) కె.రామచంద్ర రావు, నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి, నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాసరావు, ఆయ శాఖల అధికారులు పాల్గొన్నారు.