నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 15: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు గిరిజనులకు సేవాలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చరిత్ర సృష్టించిన మహనీయులు పుట్టిన రోజులను అధికారికంగా నిర్వహించుకోవడం.. అది వారికి మనమిచ్చే గౌరవమని పేర్కొన్నారు. వారి సేవలు గుర్తు చేసుకోవడం ద్వారా మనలో కూడా పరివర్తన వస్తుందన్నారు. సేవాలాల్ మహరాజ్ గిరిజన కుటుంబంలో పుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన బోధనలు, సూచనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పాఠశాలలో నూతన వసతి గృహం కోసం రూ. ఏడు కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో రామ్రావ్ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజచేస్తామన్నా రు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, బంజారా నాయకులు బలరాం, గోపాల్, భీంరావ్, విఠల్, శ్యామ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ వర్ని మండలం సేవాలాల్ తండాలోని సేవాలాల్ మహరాజ్ మందిర వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.