సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి ‘ఫీవర్’పట్టుకున్నది. విష జ్వరాలతో వణికిపోతున్నది. ఊరు ఊరంతా మంచం పట్టింది. పక్షం రోజుల వ్యవధిలోనే భూంపల్లిలో ఇద్దరు, సదాశివనగర్ మండలంలో ఒకరు జ్వరంతో మృతి చెందడం కలకలం రేపింది. పారిశుద్ధ్య చర్యలు కొరవడడం, దోమలు విజృంభించడంతో భూంపల్లిలోని ప్రతి ఇంటా విషజ్వరాలతో బాధ పడుతున్నారు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలు జ్వర బాధితులుగా మారడంతో వారి ఆలనాపాలన చూసే వారే లేకుండా పోయారు.
-రామారెడ్డి, ఆగస్టు 26
భూంపల్లిలో వ్యాధుల తీవ్రతపై నమస్తే తెలంగాణ వరుసగా వార్తలు ప్రచురించడం వైద్యాధికారుల్లో చలనం తెప్పించింది. మూడుసార్లు మెడికల్ క్యాం ప్లు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్వో బృందం గ్రామంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించింది. సోమవారం మరోమారు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వారం పాటు కొనసాగుతుందని, గ్రామస్తులు చికిత్సలు పొందాలని సూచించింది.
భూంపల్లి వాసులు నెల రోజులుగా విష జ్వరాలతో బాధ పడుతున్నారు. చిన్నా, పెద్ద అన్న తేడా లేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ అనారోగ్యం బారిన పడ్డారు. దీనికి తోడు ఇదే గ్రామంలో ఇద్దరు (రంజిత్, మాన్యశ్రీ) జ్వర బారిన పడి మృతి చెందడం, ఆశ కార్యకర్త కూతురే సీజనల్ వ్యాధులకు బలి కావడంతో గ్రామస్తుల్లో ఒకింత భయాందోళన నెలకొంది.
మరోవైపు, జ్వర మరణాలపై వైద్యాధికారులు చెబుతున్న అంశాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. భూంపల్లిలో ఇద్ద రు పిల్లలు మృతి చెందడానికి కారణం ఆర్ఎంపీలేనని వైద్యాధికారులు తెలిపారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులకు డెంగీ, మలేరియా లేదని వైద్య పరీక్షల్లో తేలిందని సదాశివనగర్ మండల వైద్యాధికారి ఆస్మా సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల రన్విత్ రెండ్రోజులుగా జ్వరంతో బాధ పడుతుండగా, స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారన్నారు. ఆర్ఎంపీ హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చిన పది నిమిషాల్లోనే రన్విత్కు ఫిట్స్ వచ్చాయని తెలిపారు.
దీంతో గాంధారి దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడన్నారు. మరోవైపు, మాన్యశ్రీ(11) విషయంలోనూ ఇలాగే జరిగిందని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. జ్వరంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, ఓవర్ యాంటీ బయోటిక్స్ ఇచ్చారన్నారు. పరిస్థితి విషమించడంతో కామారెడ్డి దవాఖానకు తరలించారని, అక్కడ ఐసీయూలో చికిత్స చేస్తుండగా రెండుసార్లు గుండెపోటు వచ్చిందని వివరించారు. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఊపిరితిత్తుల సమస్య (పల్మనరీ ఫెయిల్యూర్) తలెత్తి చిన్నారి మరణించిందన్నారు. ఇద్దరు చిన్నారులు డెంగీతో మృతి చెందలేదని, ప్లేట్లెట్స్ సైతం సరిగ్గానే ఉన్నాయని తెలిపారు.
మా ఊళ్ల్లే అందరికీ జ్వరాలే ఉన్నాయ్. ఇంట్ల ఓళ్లకు పాణం మంచిగ ఉంటలేదు. మొన్న మా మనువరాలు చిన్నపొల్ల జ్వరమొచ్చి సచ్చిపోయింది. యాడికెళ్లి అచ్చిందో ఈ గత్తర. మస్తు ఇబ్బంది పడుతున్నం. ఈ జ్వరాలు పోయేదాకా డాక్టర్లు మా ఊళ్లనే ఉండాలే. మంచి సూదులు, మందులు ఇయ్యాలే.
– మెగ్గం సాయవ్వ, భూంపల్లి వాసి
మా ఊరంతా ఆగమైంది. ఇద్దరు పిల్లలు చనిపోవడం బాధగా, భయంగా ఉంది. నెల రోజుల నుంచి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్ల చూసినా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 15 రోజుల్లో రెండుసార్లు మెడికల్ క్యాంపులు పెట్టిండ్రు. అయినా జ్వరాల తీవ్రత తగ్గలేదు. కామారెడ్డిలోని ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి చూపించుకుంటున్నాం. డబ్బులు పోతున్నా ప్రాణాలు సక్కగైతలేవు. మా గ్రామస్తులందరికీ ప్రభుత్వం మంచి వైద్యం అందించాలి.
– దేవి సతీశ్, భూంపల్లి వాసి
వర్షాలు ప్రారంభమైన టైంల గ్రామంలో పారిశుద్ధ్య పనులు చక్కగా జరుగలేవు. అందుకే నెల రోజుల నుంచి ఊరంతా మంచం పట్టింది. పారిశుద్ధ్య పనుల మీద అధికారులను అడిగితే నిధుల్లేవు ఏం చేయమంటారని అంటున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్లే విష జ్వరాలు విజృంభించాయి. అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్యం మెరుగు పరచడంతో పాటు నాణ్యమైన వైద్యం అందించాలి
– పడిగెల రాజేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ
భూంపల్లిలో కొద్దిరోజులుగా జ్వరాలు విజృంభిస్తున్న మాట నిజమే. మా సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించారు. మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తుండడంలో వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. ఇద్దరు చిన్నారుల మృతికి డెంగీ కారణం కాదు. ఆర్ఎంపీ వైద్యులు ఓవర్ డోస్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే వారు చనిపోయారు. గ్రామస్తులందరూ పూర్తి ఆరోగ్యవంతులయ్యే వరకూ మెడికల్ క్యాంప్ కొనసాగిస్తాం. పారిశుద్ధ్య సిబ్బంది సహకరించాలి.
– డాక్టర్ ఆస్మా, మండల వైద్యాధికారి