అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈసారి తమ బడులు సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతాయన్న సంబురంతో విద్యార్థులు రానున్నారు. కానీ .. అన్ని బడుల్లో ఆ పరిస్థితి కనిపించేలా లేదు. కొన్ని పాఠశాలల్లో మొండి గోడలు, పూర్తికాని గదులు, అరకొర మౌలిక వసతులే మళ్లీ స్వాగతం పలికేలా ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1234 పాఠశాలలుండగా 790 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద ఎంపిక చేశారు.
లింగంపేట(నాగిరెడ్డిపేట), జూన్ 6: లింగంపేట మండలం చెట్పల్లి సంగారెడ్డి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గురువారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో తరగతి గదుల మరమ్మతుల చేపడుతుండగా అకస్మాతుగా గోడ కూలింది. నెల రోజులుగా పాఠశాలలో మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం అమావాస్య కావడంతో మేస్త్రీలు, కూలీలు పనులకు రాలేదు. పనులు చేపడుతుండగా గోడ కూలితే పరిస్థితి దారుణంగా ఉండేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతులు కాకుండా వాటిని తొలగించి నూతన గదులు నిర్మించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అయినా పట్టించుకోకుండా తిరిగి వాటికే మరమ్మతులు చేయడంతో గోడ కూలిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన గదులను పూర్తిగా తొలగించి కొత్తవాటిని నిర్మించాలని కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట రూ.34 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధుల ద్వారానే పనులను చేపడుతున్నారు. పాఠశాలల్లో ప్రధానమైన సమస్యలను గుర్తించి వాటి పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పనులను పంచాయతీ రాజ్, ఆర్అండ్బీతోపాటు ఇతర శాఖల ద్వారా చేపడుతున్నట్లు తెలిసింది. ఒక వైపు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నప్పటికీ పలుచోట్ల పనులు నెమ్మదిగా సాగుతుండడం గమనార్హం.
సర్కారు బడులపై అధికారుల పట్టింపు కరువైంది. గత ప్రభుత్వంలో తలపెట్టిన పనులు అటకెక్కాయి. కొత్త ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలకు సరికొత్త హంగులు తేవాలనే ఉద్దేశంతో ఉన్నా… కొన్ని చోట్ల అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, గదులకు తలుపులు, కిటికీలు, బెస్మెంట్తోపాటు కుర్చీలు, బెంచీలు అవసరం ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో గోడలు దెబ్బతినడంతో వానకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్నింటిలో పైకప్పులు కూడా శిథిలావస్థకు చేరాయి. వీటిని గుర్తించిన ప్రభుత్వం పనులను సక్రమంగా చేయాలని ఆదేశించింది. ఈ పనుల పర్యవేక్షణ కోసం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే పర్యవేక్షణ కొరవడి పనులు ముందుకు సాగడం లేదు. దీంతో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తవుతాయా అన్న సందేహం నెలకొన్నది. కొన్నిచోట్ల జిల్లా స్థాయి అధికారులు, అదనపు కలెక్టర్లు తనిఖీలు చేస్తుండడంతో పనులు సాగుతున్నాయి.
ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. 12లోపు మౌలిక సదుపాయాలు పూర్తిచేస్తాం. పలు పాఠశాలల్లో గోడలు, పైకప్పులు దెబ్బతిన్నాయి. తలుపులు, కిటికీలు కూడా బాగోలేవు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు తర్వితగతిన చేపడుతున్నాం.