కామారెడ్డి/ఖలీల్‌వాడి, జూన్ 15: బడిగంట మోగింది. వేసవి సెలవులు పూర్తికావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎప్పుడూ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభంకాగా, 13న రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో జూన్ 15న పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు.
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. నేడు మంగళవారం కావడంతో మరికొందరు పంపించే అవకాశం కనిపించడంలేదు. బుధవారం నుంచి విద్యార్థులను పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా కనిపించడం గమనార్హం. మొత్తానికి అమావాస్య ఎఫెక్ట్‌తో ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.