లింగంపేట, డిసెంబర్21: పంచాయతీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా…అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీలో నూతన పాలకవర్గాలు నేడు కొలువు దీరనుండగా..వారికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వాటిని ఎలా పరిష్కరిస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన నాటి నుంచి రెండేండ్లుగా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయి స్తూ వచ్చారు. పంచాయతీ పాలకవర్గాలు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధు లు రాకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు పంచాయతీ కార్మికుల వేతనాలు, ఇతర పనులకు వెచ్చించారు. చిన్న పంచాయతీల్లో చేపట్టిన పనులకు సం బంధించిన బిల్లులు రాక పోవడంతో ఒక్కో కార్యదర్శి సుమారు రూ. 3 లక్షల నుంచి రూ. 5లక్షల వరకు అప్పులు చేసి పనులు చేయించారు. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామా ల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ముందుగా ప్రాధా న్యం ఇవ్వాల్సి ఉంటుం ది. ముఖ్యంగా తాగునీటి సరఫరా, మురికి కాలువలు శుభ్రం చేయించడం, వీధి దీపాల ఏర్పా టు, తాగునీటి సరఫరా చేసే పైప్లైన్ల మరమ్మతులు, బోరు మోటర్లు రిపేర్లు చేయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు చేయగా వచ్చిన డబ్బులతో కాలం వెల్లదీశారు.
మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మురికి కాలువలు శుభ్రం చేయించడానికి ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేయాల్సిందే. పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులతో పూర్తి స్థాయిలో కాలువలు శుభ్రం చేయడం సాధ్యం కాలేకపోయింది. ప్రతిరోజూ వీధులను శుభ్రం చేయ డం, చెత్త సేకరించడం పనులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి విడుదల చేసిన నిధులతో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలను నిర్మించారు. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఎన్నికైనందున కేంద్రం నుంచి నిధులు రావడానికి కనీసం 30 రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త సర్పంచులు గ్రామస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, అభివృద్ధి పనులు చేపట్టడానికి వచ్చే నిధుల కోసం వేచి చూడాల్సిందే.