నిజామాబాద్, డిసెంబర్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్పంచ్ పదవి గ్రామాల్లో ఊరికి పెద్దగా భావిస్తారు. గతంలో ఈ స్థానంపై కూర్చోవాలంటే మధ్య వయసు దాటిన వారే ఎక్కువగా పోటీ పడేవారు. హుందాతనం, గౌరవ మర్యాదలు ఉండడంతో సర్పంచ్ పదవి అంటే చాలా మందికి మోజు ఉంటుంది. దశాబ్దాలుగా సర్పంచ్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది పెద్ద వయస్కులు మాత్రమే. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండానే పంచాయితీలు తెంపడం, గ్రామంలో ఏ సమస్యకైనా ముందుండే అవకాశం కేవలం సర్పంచ్‌కే దక్కుతుంది. గ్రామ ప్రథమ పౌరుడిగా వచ్చే గుర్తింపు కూడా అంతా ఇంతా కాదు.
అధికారిక, అనధికారికంగా సర్పంచ్ పదవికి ఉండే మర్యాదలకు కొదువే ఉండదు. దశాబ్దాలుగా ఒక రకమైన ట్రెండ్ కొనసాగగా… ప్రస్తుతం కొత్త తరహా తీరు వ్యాప్తి చెందుతోంది. యువతరం మార్పు కోరుకుంటూ రాజకీయాల్లో రాణించేందుకు సర్పంచ్ పదవినే ఆయుధంగా భావిస్తోంది. కలిసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రంగంలోకి దిగి సర్పంచ్‌గా గెలిచేందుకు పోటీ పడుతున్నారు. ఊరి జనాల మనసు దోచుకునేందుకు కొత్త తరహా ప్రచార వ్యూహాలతో దుమ్ము రేపుతున్నారు. సోషల్ మీడియాను బలంగా వాడుకుంటూ తమదైన ముద్రను వేస్తున్నారు.
రాజకీయాల్లో రాణించాలని ఉవ్విళ్లూరే వారికి సర్పంచ్ ఎన్నికలు తొలి మెట్టుగా మారబోతోంది. అందులో భాగంగానే ఎన్నికల్లో గెలిచినా? ఓడినా? అనుభవం వస్తుందనే ఆశ తో ముందుకు కదులుతున్నారు. భవిష్యత్తులో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు సైతం ఈ అనుభవం కలిసి వస్తుందనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది. రాజకీయాల్లో కొనసాగాలనే దూరదృష్టి కలిగిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికలను వదులుకోవడం లేదు. గ్రామాల్లో సత్తా చాటితే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీల్లోనైనా మండల స్థాయి నేతగా ఎదగవచ్చనే లక్ష్యాన్ని చాలా మందికి నిర్ధేశించుకున్నారు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లోనూ పోటీ పడవచ్చనే ఆలోచనలు సైతం అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
రాజకీయ పార్టీల్లో కీలక నేతలుగా కొనసాగుతోన్న లీడర్లు సైతం తమ వారసులను సర్పంచ్ ఎన్నికల్లోకి దింపుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకుని పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొడుకులు లేదంటే కోడళ్లను పోటీ చేయిస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలించని చోట రాజకీయ నేతలు తమ భార్యలను సైతం రంగంలోకి దించారు. కొద్ది మంది కూతుర్లను ప్రోత్సహిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడి డబ్బులు సంపాదించిన కుటుంబాలు సైతం తమ వారిని బలంగా ప్రోత్సహిస్తున్నారు. నగదు వెదజల్లి గెలుపును స్వాధీనం చేసుకోవచ్చనే ఆలోచన వారిలో కనిపిస్తోంది. ఇలా ఏ విధంగా చూసినప్పటికీ గ్రామాల్లో ఇప్పుడంతా పెద్దరాయుడు బదులుగా చిన్నరాయుడు పాత్రలే గోచరిస్తున్నాయని జనాలంతా చర్చించుకుంటున్నారు.
గ్రామాల్లో వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ స్థానికంగానే ఉండేవారు ఒక వర్గంగా… ఉన్నత చదువులు చదివి ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయినవారంతా మరో వర్గంగా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు పల్లెల్లోనే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారికి కలిసి వస్తోంది. స్వల్పంగా డబ్బు, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబాల నుంచి మంచి ఉద్యోగాలను వదులుకుని పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇలా యువత రంగ ప్రవేశంతో పల్లెలకు కొత్త తరహా పాలకులు రాబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 60శాతానికి పైగా పల్లెల్లో యువజనులే పోటీలో ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రమే మధ్య వయసు దాటిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో సర్పంచ్‌గా పదవి అనుభవించిన వారు కూడా స్వల్పంగానే ఉన్నారు.
పాత తరానికి నేటి సమాజంలోని పరిస్థితులపై పట్టు లేకపోవడం, డిజిటల్ యుగంలో సమస్యల పరిష్కారంలో చూపాల్సిన చొరవపై అవగాహన కరువై విలవిల్లాడుతున్నారు. వీరికి యువతీ, యువకుల రూపంలో వస్తోన్న పోటీకి వారంతా భయాందోళనకు గురి కావాల్సి వస్తోంది. గ్రామంలో తాగేందుకు స్వచ్ఛమైన నీరు, మెరుగైన విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు, సరైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యా, వైద్యం కొంత మంది చొరవ తీసుకుని ప్రజల్లోకి దూసుకు పోతున్నారు. బాండ్ పేపర్ కల్చర్‌ను సైతం అవలంభిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించడానికి అనుభవం, వయసుతో పని లేదంటూ యువత కొత్త తరహా ట్రెండ్‌ను తిరగరాస్తోంది.