శక్కర్‌నగర్/బాన్సువాడ, మార్చి 28: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. మొన్న అంగన్వాడీలు, నిన్న పారిశుద్ధ్య కార్మికులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు..
తాజాగా శనివారం ఆశ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపు ప్రకటించాలనే డిమాండ్‌తో ఆశ వర్కర్లు ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరూ హైదరాబాద్‌కు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బాన్సువాడ, బోధన్ సహా పలు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.
డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేసేందుకు వెళ్తున్న తమను నిర్బంధించడం ఏమిటని ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు ఆపి, తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయమైన కోర్కెలు తీర్చకపోగా, అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆశ సంబంధం లేని పనులు చేయిస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేస్తే తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అవుతాయా? అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం సమస్యలు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు.