నమస్తే తెలంగాణ యంత్రాగం, సెప్టెంబర్ 29 : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తీరొక్క పాటలతో ఊరూవాడా మార్మోగింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాలు పూలవనంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరుపుకున్న సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ ఉత్సవాలకు సద్దుల బతుకమ్మతో ఘనమైన ముగింపు పలికారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్దకు చేర్చారు.
సంప్రదాయ దుస్తుల్లో మహిళలు లయబద్దంగా అడుగులేస్తూ బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం గ్రామ సమీప చెరువు, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వెళ్లిరా బతుకమ్మ .. మళ్లీ రావమ్మా..అంటూ సాగనంపారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకొని, వెంట తెచ్చుకున్న సద్దులను అక్కడే ఆరగించారు.
వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, సతీమణి నీరజ పాల్గొన్నారు. జంబిహనుమాన్ ఆలయం వద్ద సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.