సదాశివనగర్, జూన్ 26: పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోకి అడుగుపెట్టగానే దారులకు ఇరువైపులా పచ్చనిచెట్ల తోరణాలు స్వాగతం పలుకుతాయి. ఎటుచూసినా రకరకాల మొక్కలతో గ్రామమంతా బృందావనాన్ని తలపిస్తున్నది. ప్రజలందరూ మొక్కలను నాటుతూ అటవీ సంపదను కాపాడాలని అవగాహన కల్పిస్తూ గ్రామంలోని పలు భవనాలకు వేసిన చిత్రాలను చూస్తేనే అర్థమవుతోందీ గ్రామ పంచాయతీ పాలకవర్గ విశేష కృషి. గ్రామంలోని వాటర్ ట్యాంకులు, పాత భవనాలు, పాఠశాల భవనాల గోడలకు వేసిన చిత్రాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ప్రముఖుల ప్రశంసలు..
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, సందర్శన నిమిత్తం సదాశివనగర్ వచ్చే ప్రముఖులు ఈ పంచాయతీ పాలకవర్గ పనితీరును మెచ్చుకోక వెళ్లరు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నంబర్ వన్‌గా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. గతంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జాజాల సురేందర్, అప్పటి కలెక్టర్ శరత్.. ఎస్‌ఎస్‌నగర్ అందాలను చూసి సర్పంచ్, పాలకవర్గాన్ని అభినందించారు.
రాష్ట్రంలోని ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారు. ఇందులో భా గంగా సదాశివనగర్ పంచాయతీ పాలకవర్గం ప్రభు త్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్, హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో సదాశివనగర్ పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనలో భేష్ అనిపించుకుంటున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన హరితోత్సవంలో పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ గ్రామ పంచాయతీ సేవా పత్రాన్ని అందుకున్నది.