బాన్సువాడ, సెప్టెంబర్ 27: అర్హులందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత ఇండ్లపై ఎవరైనా బిల్లులు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరుకాపు సంఘంలో ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా గృహలక్ష్మి పథకం కింద కింద ఎంపికైన 400 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. తక్కువ స్థలం ఉండి ఇండ్లు లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లను మంజూరుచేస్తున్నట్లు తెలిపారు.
ఇండ్ల మంజూరు లేదా ఇండ్ల కోసం పైరవీలు చేసే వారికి ఒక్క రూపాయి లంచం ఇచ్చినా వారి ఇంటిని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. గృహలక్ష్మి పేరుతో ఇండ్లను ఆడబిడ్డ పేరుమీద ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. ఈసందర్భంగా గృహలక్ష్మి పథకంలో నిర్మించే ఇల్లును మ్యాపు ద్వారా లబ్ధిదారులకు వివరించారు. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారని తెలిపారు. నియోజక వర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున మంజూరుచేస్తున్నారని చెప్పారు. ఇల్లు కట్టుకోవద్దంటూ ఎవరైనా భయం చెబుతారని, నమ్మవద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదోళ్ల ఇండ్ల పేరిట బిల్లులు మింగేశారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయినప్పటికీ పేదవారు ఇంకా పేదవారిగానే ఎందుకు ఉంటున్నారని అన్నారు. పాలించే నాయకులు దొంగలయ్యారు కాబట్టే దేశంలో ఇంకా పేదరికం ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బాన్సువాడ నియోజక వర్గంలో సుమారు 24 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, కట్టినట్లు అధికారుల రికార్డులు చూపుతున్నాయని అన్నారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టక పోతే ..వందేండ్లయినా పేదరికం పోదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలను పెద్దలు దోచుకున్నారు కాబట్టే ఇంకా నియోజక వర్గంలో ఇండ్లు కావాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో 250 మంది అధికారుల ఉద్యోగాలు పోయాయని గుర్తుచేశారు. బీర్కూర్‌లో 493 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని, వాటిలో 343 ఇండ్లు నిర్మించినట్లు బిల్లులు లేపుకొన్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో భజంగరావు, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో భానుప్రకాశ్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్, ఎంపీటీసీ సందీప్ పటేల్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు శశికాంత్, ఏఎంసీ చైర్మన్ అశోక్, విండో చైర్మన్ గాంధీ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అవారి గంగారాం, మండల కో -ఆప్షన్ మెంబర్ ఆరిఫ్, సర్పంచులు పుల్లెని బాబు, కృష్ణారెడ్డి, విఠల్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.