వర్ని/మోస్రా (చందూరు) ఫిబ్రవరి 21: బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవా రం ఆయన వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో వర్ని, మోస్రాలో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి బాన్సువాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు బీజేపీ నాయకులకు కనబడడంలేదని, సీఎం కేసీఆర్ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు తరలిస్తున్న మొరం, ఇసుకను చూస్తున్న బీజేపీ నాయకులు.. తన కుమారులు, అనుచరులు ఇసుక మాఫియా నడిపిస్తున్నారంటూ విమర్శిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కో సం చేస్తున్న పనులను మాఫియా అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తిప్పి కొట్టాలని సూచించారు. వర్ని, రుద్రూరు మండలాల గ్రామాలకు మంజూరైన అభివృద్ధి పనులను జూన్ నెలలోగా పూర్తి చేయాలన్నారు.
అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలి
అర్హులైన పోడుభూముల లబ్ధిదారులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఇవ్వాలని అధికారులను సభాపతి పోచారం ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన మోస్రా, చందూర్ మండలాలకు కేటాయించిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. జూన్ నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాన్సువాడ నియోజక వర్గానికి భారీగా నిధులను మంజూరు చేశారని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా అందజేస్తామన్నారు. అర్హులను స్థానిక నాయకులు గుర్తించాలని సూచించారు. ఇల్లు లేని నిరుపేద ఒక్కరూ ఉండకూడదన్నారు. అనంతరం పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను సభాపతి అందజేశారు. వర్నిలో నిర్వహించిన సమావేశంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, నారోజీ గంగారాం, వైస్ ఎంపీపీలు దండ్ల బాలరాజు, నట్కరి సాయిలు, కో- ఆప్షన్ సభ్యుడు కరీం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారాం, తోట సంగయ్య, పార్టీ నాయకులు కల్లాలిగిరి, పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
మోస్రాలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్ , ఏసీపీ కిరణ్, జడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, వైస్ ఎంపీపీ కత్తి శంకర్, ఎంపీటీసీ మమత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి , అంబర్ సింగ్, సర్పంచులు సుమలతా రాంరెడ్డి, విమలా లింగయ్య, సున్నం భూమయ్య, నరేందర్ రెడ్డి, సాయారెడ్డి, బొడ్డోల్ల సత్యనారాయణ, దేవీసింగ్, రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.