కోటగిరి, ఆగస్టు 25: బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. శుక్రవారం ఆయన కోటగిరి మండల కేంద్రంలో పర్యటించారు. రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన పలు కుల సంఘాల ఫంక్షన్ హాళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజలకు అడిగినవన్నీ ఇచ్చానని, తనను ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద నియోజకవర్గంలో11 వేల ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ పథకాల గురించి వివరించారు.
రైతుబీమాలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదని తెలిపారు. కోటగిరిలో 50 పడకల దవాఖాన కోసం రూ.13 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల వినతిమేరకు వంద ఫంక్షన్ హాళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు మద్దత ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి సకాలంలో వారి ఖాతాలో డబ్బులు జమ చేసిందన్నారు. కానీ పక్క రాష్ర్టాల్లో రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడన్నారు. దీంతో అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి పంటను అమ్ముకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అంతకుముందు సభాపతికి గ్రామస్తులు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాసరావు, జడ్పీటీసీ శంకర్‌పటేల్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, బోధన్ ఆర్డీవో రాజాగౌడ్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్ పటేల్, జడ్పీ కో-ఆప్షన్ సిరాజ్, ఇస్మాయిల్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్‌పటేల్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, కిశోర్‌బాబు, విండో చైర్మన్ కూచి సిద్దూ, అనిల్ కులకర్ణి, బర్ల గంగారాం, బీర్కూర్ గంగాధర్, హౌగిరిరావుపటేల్, పి.సాయిలు, కప్ప రాజయ్య, భీంసాయారెడ్డి, బర్ల మధు, ఐసీడీఎస్ బోధన్ సీడీపీవో జానకి, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో మనోహర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.